పారిస్: ఇండియా పారా అథ్లెట్ ప్రీతి పాల్ చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్ ఈవెంట్లలో రెండు పతకాలు నెగ్గి ఈ ఘనత సాధించిన దేశ తొలి మహిళగా రికార్డుకెక్కింది. మొన్న టీ35 విమెన్స్ 100 మీటర్ల ఈవెంట్‌లో కాంస్యం తెచ్చిన 23 ఏండ్ల ప్రీతి.. 200 మీటర్ల పోటీలోనూ కంచు మోత మోగించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రీతి 30.01 సెకన్ల టైమింగ్‌తో పర్సనల్ బెస్ట్ నమోదు చేస్తూ మూడో స్థానం సాధించింది. దాంతో అవని లేఖరా(టోక్యో) తర్వాత ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన ఇండియా రెండో మహిళగా నిలిచింది. చైనాకు చెందిన జియా జౌ 28.15 సెకన్లతో గోల్డ్ నెగ్గగా, క్వింకిన్ గువో 29.09 సెకన్లతో రెండో ప్లేస్‌తో సిల్వర్ ఖాతాలో వేసుకుంది.
పుట్టుకతోనే పోరాటం..
యూపీలోని ముజాఫర్‌నగర్‌లో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ప్రీతికి పుట్టకతోనే పోరాటం అలవాటు. చిన్నప్పటి నుంచే అనేక శారీరక సమస్యలు, సవాళ్లను ఎదుర్కొంది. పుట్టిన ఆరు రోజుల తర్వాత ఆమె నడుం కింది భాగం చచ్చుబడిపోయింది. దాని నుంచి కోలుకున్నా కాళ్లు బలహీనంగా, వంకరగా మారడంతో వివిధ వ్యాధులకు గురైంది. కాళ్లకు బలం చేకూర్చేందుకు తల్లిదండ్రులు ఎన్నో చికిత్సలు చేయించారు. ఓ దశలో ఆమె బతుకుతుందో లేదో అన్న అనుమానాలు కూడా కలిగాయి. కానీ, కఠిన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్న ప్రీతి17 ఏండ్ల వయసులో పారా అథ్లెట్ అవ్వాలని అనుకుంది.
ఆలస్యంగా ఆటలో అడుగు పెట్టిన ప్రీతిని ఆర్థిక కష్టాలు ఇబ్బంది పెట్టగా.. ఇండియా పారా అథ్లెట్ ఫాతిమా ఖాతూన్ ఆమెకు సపోర్ట్ ఇచ్చింది. దాంతో ఢిల్లీకి మకాం మార్చి కోచ్ గజేందర్ సింగ్ వద్ద శిక్షణ తీసుకున్న ఈ యూపీ అథ్లెట్‌అంచెలంచెలుగా ఎదిగింది. ఈ ఏడాది వరల్డ్ పారా అథ్లెటిక్స్‌లో రెండు కాంస్యాలు గెలిచిన ప్రీతి పారాలింపిక్స్‌లోనూ ఆ ఫలితాన్ని పునరావృతం చేసింది. ఇండియన్ పారా అథ్లెటిక్స్ చరిత్రలో తన పేరును లిఖించుకుంది.
3 రజతాలు ఖాయం
బ్యాడ్మింటన్‌లో ఇండియాకు మూడు రజతాలు ఖాయమయ్యాయి. టోక్యో సిల్వర్ మెడలిస్ట్, ఐఏఎస్‌ఆఫీసర్ సుహాస్ యతిరాజ్‌వరుసగా రెండో పారాలింపిక్స్‌లో ఫైనల్ చేరాడు. నితేశ్ కుమార్ తొలిసారి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. అమ్మాయిల్లో మనీషా రామ్‌దాస్, మతి సివాన్ నిత్య శ్రీ సెమీస్‌లో అడుగుపెట్టారు. మెన్స్ సింగిల్స్ ఎస్‌ఎల్3 సెమీఫైనల్లో నితేశ్ కుమార్ 21–16, 21–12తో ఫుజిహర డైసుకి (జపాన్)పై, ఎస్‌ఎల్4 సెమీస్‌లో సుహాస్ యతిరాజ్ 21–17, 21–12తో తోటి షట్లర్ సుకాంత్ కడమ్‌పై నెగ్గి ఫైనల్లోకి ప్రవేశించారు.
దీంతో కనీసం రెండు రజతాలు ఖాయం చేశారు. విమెన్స్ సింగిల్స్ ఎస్‌యూ5 క్వార్టర్‌ఫైనల్లో రెండో సీడ్, 19 ఏండ్ల మనీషా 21–13, 21–16తో మమికో టోయోడా (జపాన్)పై గెలిచి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. సెమీస్‌లో మనీషా.. ఇండియాకే చెందిన తులసిమతి మురుగేశన్‌తో తలపడుతుంది. ఇందులో ఎవరు గెలిచినా కనీసం రజతమైనా దక్కుతుంది. ఎస్‌హెచ్6 క్వార్టర్స్‌లో నిత్య శ్రీ 21–4, 21–7తో ఒలివియా మిజెల్ (పోలెండ్)పై నెగ్గి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఎస్‌ఎల్3 కేటగిరీ క్వార్టర్స్‌లో మన్‌దీప్ కౌర్, ఎస్‌ఎల్4 కేటగిరీ క్వార్టర్స్ పోరులో పాలక్ కోహ్లీ ఓడారు.
ప్రోన్‌లో నిరాశపర్చిన అవని
10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో గోల్డ్ మెడల్‌తో మెరిసిన స్టార్ షూటర్ అవని లేఖరా, సిద్ధార్థ్ బాబు.. 10 మీ. మిక్స్‌డ్ ఎయిర్ రైఫిల్ ప్రోన్ (ఎస్‌హెచ్1)లో ఫైనల్ చేరలేకపోయారు. క్వాలిఫికేషన్ రౌండ్ పోటీల్లో అవని 632.8 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచింది.. సిద్ధార్థ్ ఆరు సిరీస్‌ల్లో కలిపి 628.3 పాయింట్లతో 28వ స్థానంలో నిలిచాడు. 10మీ. ఎయిర్ రైఫిల్ ప్రోన్ (ఎస్‌హెచ్2)లో శ్రీహర్ష 630.2 పాయింట్లతో 26వ ప్లేస్‌తో సరిపెట్టాడు.
రవికి ఐదో స్థానం
మెన్స్ ఎఫ్–40 షాట్‌పుట్‌లో రవి రొంగలి ఐదో స్థానంలో నిలిచి గేమ్స్ నుంచి వైదొలిగాడు. ఫైనల్లో రవి ఇనుప గుండును 10.63 మీటర్ల దూరం (పర్సనల్ బెస్ట్) విసిరాడు. విమెన్స్ 1500 మీటర్ల టీ11 హీట్స్–3లో రక్షిత రాజు 5:29.92 సెకన్లతో మూడో ప్లేస్‌లో నిలిచి ఫైనల్‌కు దూరమైంది. రోయింగ్ పీఆర్3 మిక్స్‌డ్ డబుల్స్ స్కల్స్ ఫైనల్–బిలో నారాయణ కొంగనపల్లి–అనిత 7:54.33 సెకన్లతో ఓవరాల్‌గా ఎనిమిదో ప్లేస్‌లో నిలిచారు.
ఒక్క పాయింట్ తేడాతో..
పారాలింపిక్స్ ఆర్చరీలో వరల్డ్ నంబర్‌వన్ ఆర్చర్ రాకేశ్ కుమార్ తృటిలో కాంస్య పతకం కోల్పోయాడు. హోరాహోరీగా సాగిన బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్స్‌లో రాకేశ్ హి జియావో (చైనా) చేతిలో ఓడాడు. తొలి రౌండ్‌లో 30 పాయింట్లు నెగ్గిన రాకేశ్.. తర్వాతి మూడు సిరీస్‌ల్లో 29, 29, 28 పాయింట్లే సాధించాడు. జియావో వరుసగా 29, 30, 28, 30 పాయింట్లు నెగ్గి 117–116తో లీడ్‌లో నిలిచాడు. చివరి సిరీస్‌లో రాకేశ్ 30 పాయింట్లు సాధించగా, జియావో కూడా పర్ఫెక్ట్ 30 కొట్టి మెడల్‌ను సొంతం చేసుకున్నాడు.