కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి చెందింది. ఈ తెల్లవారుజామున ఆఫ్రికన్ మగ చిరుత సూరజ్ చనిపోయింది. చీతా మరణానికి సంబంధించిన కారణాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఈ పార్క్ లో ఇటీవలే తేజస్ అనే చీతా చనిపోగా, సూరజ్ మరణంతో గత 4 నెలల వ్యవధిలో ఆ సంఖ్య ఎనిమిదికి చేరుకుంది.
ALSOREAD:సోమవారం (17న) స్కూళ్లు, కాలేజీలకు సెలవు
మార్చి 27న ఆడ చిరుత పులి సాషా మూత్రపిండాల వ్యాధితో మరణించింది. ఏప్రిల్ 23న ఉదయ్ అనే చిరుత పులి కార్డియో-పల్మనరీ వైఫల్యంతో ప్రాణాలు కోల్పోయింది. మే 9న దక్ష అనే ఆడ చిరుత పులి ఓ మగ చిరుత పులితో సంతానోత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నపుడు మరణించింది. మే 25న రెండు చిరుత పులి పిల్లలు వడగాడ్పుల వాతావరణాన్ని తట్టుకోలేక, డీహైడ్రేషన్‌తో మరణించాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో అంతరించిపోయిన చిరుతలను పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా గతేడాది సెప్టెంబర్ 17న కునో నేషనల్ పార్క్ వద్ద నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతలను (5 ఆడ, 3 మగ) ప్రధాని మోదీ విడుదల చేశారు . ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చిరుతలను తీసుకొచ్చారు.