తిరుమలలో మరోసారి చిరుత కలకలం

హైదరాబాద్, వెలుగు:  తిరుమల నడకదారిలో రెండు చిరుతలు కనిపించడం కలకలం సృష్టించింది. సోమవారం అలిపిరి నడకదారిలోని ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచారం చేయడం భక్తులకు కనిపించింది. దీంతో వారు భయంతో బిగ్గరగా కేకలు వేశారు. భక్తుల కేకలు విని చిరుతలు అడవిలోకి పారిపోయాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన తిరుమల భద్రతా సిబ్బంది నడకదారిలో వెళ్లే భక్తులను గుంపులుగుంపులుగా పంపిస్తున్నారు.

విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. చిరుతల జాడను కనుగొనేందుకు అటవీశాఖ ఉద్యోగులు కూడా చర్యలు మొదలుపెట్టారు. గతంలో అలిపిరి నడకదారిలో ఓ చిరుత బాలుడిపై దాడిచేసి చంపేసిన సంగతి తెలిసిందే.