- వీవీఐపీల బంగ్లాల కోసం 27 వేల చెట్లను నరికేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్లాన్
- చెట్లను తొలగిస్తే ఉద్యమం చేస్తామని పర్యావరణవేత్తలు, ప్రజల హెచ్చరిక
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మరో చిప్కో ఉద్యమం మొదలైంది. వీవీఐపీల నివాసాల కోసం లగ్జరీ బంగ్లాలు నిర్మించేందుకు సిటీలో దాదాపు 27 వేలకు పైగా చెట్లను నరికి వేయనున్నారని తెలియడంతో పర్యావరణవేత్తలు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భోపాల్ సిటీలో అత్యంత పచ్చదనం ఉండే శివాజీ నగర్, తులసీ నగర్ ప్రాంతాల్లో మధ్యప్రదేశ్ హౌసింగ్ బోర్డ్ ఆధ్వర్యంలో వీవీఐపీలు, ఎమ్మెల్యేలు, బ్యూరోక్రాట్ల కోసం కొత్త భవన నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించారు.
వీటి కోసం ఈ ప్రాంతాల్లో దాదాపు 27 వేలకుపైగా చెట్లను తొలగించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ విషయంలో సర్కార్ స్పందించకపోతే చిప్కో మూమెంట్ తరహాలో భారీ నిరసనను చేపడతామని పర్యావరణ కార్యకర్త డాక్టర్ సుభాష్ సి పాండే హెచ్చరించారు. ఈ విషయమై సంబంధిత అధికారులను కలిశామని ఆయన తెలిపారు.