అంకుసాపూర్​లో ఫారెస్ట్ వర్సెస్ ఫార్మర్స్

అంకుసాపూర్​లో ఫారెస్ట్ వర్సెస్ ఫార్మర్స్
  •     హద్దు పోళ్లు వేసేందుకు ఫారెస్ట్ ఆఫీసర్ల యత్నం
  •     అడ్డుకున్న రైతులు.. ఘర్షణ వాతావరణం

కాగజ్ నగర్, వెలుగు : కాగజ్‌నగర్‌ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అంకుషాపూర్ శివారులో ఫారెస్ట్ ఆఫీసర్లు, గ్రామస్తులకు మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అంకుసాపూర్ శివారులోని సర్వే నంబర్ 145లో ఫారెస్ట్ బౌండరీ ఫిల్లర్స్ వేయడానికి శనివారం ఫారెస్ట్ అధికారులు వెళ్లారు. విషయం తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని అధికారులను నిలదీశారు. తాము దశాబ్దాలుగా   సాగుచేసుకుంటున్న భూములకు రెవెన్యూ పట్టాలు ఉన్నాయని

ఇక్కడ ఎందుకు పిల్లర్లు వేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏండ్లుగా తాము సాగుచేస్తున్న భూములను లాక్కోవాలని చూడొద్దని, ఇబ్బంది పెడితే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న కాగజ్‌నగర్‌ రూరల్ సీఐ రాంబాబు, ఇన్​చార్జి రేంజ్ ఆఫీసర్ రమాదేవి సిబ్బందితో అక్కడికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడారు

రైతుల వద్ద ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలను పరిశీలించారు. రైతులు తన పాస్ బుక్ లు, ఆధార్ కార్డులను తీసుకొని  సోమవారం తహసీల్దార్ కార్యాలయానికి రావాలని సూచించిన సీఐ రాంబాబు.. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని చెప్పడంతో రైతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.