ఈడీకు మరో కంప్లైంట్.. ఐఏఎస్ అమోయ్ కుమార్‎కు బిగుస్తోన్న ఉచ్చు

ఈడీకు మరో కంప్లైంట్.. ఐఏఎస్ అమోయ్ కుమార్‎కు బిగుస్తోన్న ఉచ్చు

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్, ఐఏఎస్ అమోయ్ కుమార్‎కు ఉచ్చు బిగుస్తోంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రభుత్వ భూములను తక్కువ ధరలకు ప్రైవేట్ వ్యక్తులకు కట్టాబెట్టారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అమోయ్ కుమార్‎ను మూడు రోజుల పాటు ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే.. ఐఏఎస్ అమోయ్ కుమార్‎పై ఈడీకి మరో ఫిర్యాదు అందింది. 

హైదరాబాద్‎లోని శంకర్ హిల్స్ ప్లాట్స్ పర్చేజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు అమోయ్ కుమార్‎పై శనివారం (అక్టోబర్ 26) ఈడీ అధికారులకు కంప్లైంట్ చేశారు. 1983లో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టి నాగులపల్లిలోని 460 ఎకరాల్లో 3,333 ప్లాట్లను కొనుగోలు చేశామని అసోసియేషన్ నాయకులు లక్ష్మీ కుమారి, కృష్ణారెడ్డిలు తెలిపారు. ఇందులో 3,228 మంది ఓనర్లను ప్లాట్ల దగ్గరికి వెళ్లనీయకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల అండతో వ్యవసాయ భూమిగా చిత్రీకరించి విద్యుత్ పర్మిషన్ తీసుకొని కబ్జా చేశారని ఆరోపించారు. 

తమ పేరుపై ఉన్న స్థలాలను ఫీనిక్స్, శ్రీనిధి కంపెనీలకు కట్టబెట్టారని.. అప్పటి మంత్రి కేటీఆర్ ప్రోద్భలంతోనే కలెక్టర్ అమోయ్ కుమార్ స్థలాల బదలాయింపు చేశారని ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు. వేల కోట్లు విలువ చేసే తమ ప్లాట్‎లను తిరిగి తమకు ఇప్పించాలని.. అవినీతికి పాల్పడిన ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‎పై చర్యలు తీసుకోవాలని కోరారు.