BPL 2025: పార్టీకి ఎగ్గొడతావా, నీ వల్ల పరువు పోయింది: బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో మరో లొల్లి

BPL 2025: పార్టీకి ఎగ్గొడతావా, నీ వల్ల పరువు పోయింది: బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో మరో లొల్లి

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL)ను వివాదాలు వీడటం లేదు. ఒకటి పోతే మరొకటి అన్నట్లు కొత్త వివాదాలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. విదేశీ ఆటగాళ్ల జీతాలు, క్రికెటర్లు బస చేసిన హోటళ్లకు బిల్లుల పెండింగ్, ఆటగాళ్లను తిప్పే బస్సు డ్రైవర్లకు జీతాలు వంటి ఎన్నో సమస్యలు.. ఇప్పుడు మరో బాగోతం బయటపడింది.

భారత సంతతి మోడల్, చిట్టగాంగ్ కింగ్స్ జట్టు మెంటార్ యెషా సాగర్(Yesha Sagar).. టోర్నీ మధ్యలోనే బంగ్లాదేశ్‌ను విడిచి పెట్టిందనేది వస్తున్న వార్తల సారాంశం. ఈ కెనడియన్ మోడల్‌ను చిట్టగాంగ్ కింగ్స్ యాజమాన్యం.. స్పాన్సర్‌షిప్ కార్యకలాపాల కోసం నియమించుకుంది. అంటే మేనేజ్మెంట్ పిలిచినప్పుడల్లా ఈమె వెళ్లాల్సిందే. అయితే ఈ ముద్దుగుమ్మ ఓ విందుకు డుమ్మా కొట్టింది. కింగ్స్ ఓనర్ అధికారికంగా ఆహ్వానించినప్పటికీ స్పాన్సర్లతో విందుకు హాజరు కాలేదు. దాంతో, యాజమాన్యం నోటీసులు ఇచ్చింది.

ALSO READ | Rohit Sharma: నేరుగా నా గుండెల్లో గుచ్చావే.. భర్త కోసం రితికా అందమైన పోస్ట్

"యెషా.. మీరు ఒప్పందం ప్రకారం, విధులను నిర్వర్తించడంలో విఫలమయ్యారు. అధికారికంగా ఆహ్వానించినప్పటికీ, స్పాన్సర్ విందుకు హాజరు కాలేదు. అవసరమైన స్పాన్సర్ షూట్లు, ప్రమోషనల్ షూట్లు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేశారు. మీ వల్ల ఫ్రాంచైజీ(చిట్టగాంగ్ కింగ్స్)కి ఆర్థికంగా నష్టం కలిగింది. ఫ్రాంచైజీ ప్రతిష్ట మంట గలిసింది.." అని చిట్టగాంగ్ కింగ్స్ యజమాని సమీర్ ఖాదర్ చౌదరి నోటీసుల్లో పేర్కొన్నారు.

నాకే నోటీసులు ఇస్తారా..!

ఇచ్చేదే అరకొర జీతం.. అందునా, పార్టీకి హాజరు కానందుకు నాకే నోటీసులు ఇస్తారా..! అని ఈ భామ ఫ్రాంచైజీ దగ్గర నుండి రావాల్సిన డబ్బు కూడా తీసుకోకుండా ఫ్లైట్ ఎక్కేసింది. ఈమె భారతదేశంలో జరుగుతున్న లెజెండ్స్ 90 లీగ్‌లో సందడి చేయనున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. 

ఎవరీ యెషా సాగర్..?

యెషా సాగర్ స్వస్థలం పంజాబ్. ఆమె 2015లో ఉన్నత చదువుల కోసం కెనడాలోని టొరంటోకు వెళ్లి అక్కడే స్థిర పడింది. స్పోర్ట్స్ ప్రెజెంటేషన్‌లోకి అడుగుపెట్టక ముందు ఈమె మోడల్, నటి. ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ కూడానూ. పంజాబీ, హిందీ సహా 30కి పైగా మ్యూజిక్ వీడియోలలో పనిచేసింది. ఈమె గ్లోబల్ టి20 కెనడా, యుపి టి20 లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌తో సహా అనేక లీగ్‌లకు హోస్ట్‌గా వ్యవహరించింది.