- రాజకీయాల్లోకి కేసీఆర్ మరో వారసుడు
- మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్ చార్జిగా కల్వకుంట్ల వంశీధర్ రావు
- అన్న కుమారుడికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి
- 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా పాలిటిక్స్ లోకి
- తండ్రి రంగారావు పేరుతో సేవా కార్యక్రమాలు
- మొన్నటి వరకు సిద్దిపేట నుంచి పోటీ చేస్తారని టాక్
- అనూహ్యంగా పొరుగు రాష్ట్రం ఇన్ చార్జిగా నియామకం
హైదరాబాద్ : బీఆర్ఎస్ పాలిటిక్స్ లోకి కల్వకుంట్ల కుటుంబం నుంచి మరో వారుసుడొచ్చారు. ఆయనే కల్వకుంట్ల వంశీధర్ రావు.. కేసీఆర్ కు ఒక అన్న, తొమ్మిది మంది సోదరీమణులు. అన్న పేరు రంగారావు. ఆయన పెద్ద కుమారుడే కల్వకుంట్ల వంశీధర్ రావు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా పాలిటిక్స్ లోకి వచ్చిన వంశీధర్ రావు అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డట్టు తెలుస్తోంది. చిరంజీవి అభిమానిగా.. డై హార్డ్ ఫ్యాన్ గా కొనసాగారు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన వంశీధర్ రావు కొంత కాలంగా బాబాయ్ కేసీఆర్ కు దగ్గరయ్యారు. బీఆర్ఎస్ పాలిటిక్స్ లోనే ఉంటున్నారు. ఇటీవల తన తండ్రి రంగారావు పేరిట ఫౌండేషన్ ఏర్పాటు చేసి సిద్దిపేట కేంద్రంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఆయన సిద్దిపేట నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. ఇవాళ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మహారాష్ట్ర కమిటీ ప్రకటించారు. అనూహ్యంగా మహారాష్ట్ర ఇన్ చార్జిగా కల్వకుంట్ల వంశీధర్ రావు పేరు ఉంది. ఆయనను ఆ రాష్ట పార్టీకి ఇన్ చార్జిగా నియమించారు.
-
రంగారావు ఫౌండేషన్ తో సేవా కార్యక్రమాలు
కేసీఆర్ తండ్రి కల్వకుంట్ల రాఘవరావుకు ఇద్దరు కుమారులు, తొమ్మిది మంది కుమార్తెలు. పెద్దకుమారుడు రంగారావు, చిన్నకొడుకు కేసీఆర్.. రంగారావుకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. వాళ్లే కల్వకుంట్ల వంశీధర్ రావు, కన్నారావు, రమ్యారావు. కేసీఆర్ కు ఒక కుమారుడు, ఒక కూతురు. వాళ్లే కే తారకరామారావు, కవిత. కల్వకుంట్ల వంశీధర్ రావు చిరంజీవికి వీరాభిమాని.. ఆయన ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. పీఆర్పీ నుంచి టికెట్ ఆశించిన వంశీధర్ రావుకు దక్కలేదని తెలుస్తోంది. రంగారావు కూతురు రమ్యారావు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఆమె కేసీఆర్ పాలనపై విమర్శలు సంధిస్తున్న విషయం తెలిసిందే. కన్నారావు పాలిటిక్స్ లో పెద్దగా యాక్టివ్ గా లేరనే చెప్పాలి.
ఒకే కుటుంబం నుంచి ఆరుగురు
కల్వకుంట్ల వంశం నుంచి నాలుగో వ్యక్తిగా వంశీధర్ రావు యాక్టివ్ పాలిటిక్స్ లో నిలిచారు. ప్రస్తుతం కేసీఆర్, కేటీఆర్, కవిత కొనసాగుతున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాగా, కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. కేసీఆర్ కూతురు కవిత ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. మొత్తంగా రాఘవరావు ఫ్యామిలీ నుంచి చూస్తే కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు వైద్య ఆరోగ్య, ఆర్థికశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అప్పడు ఆ కుటుంబ సభ్యుల సంఖ్య ఐదుకు చేరుతుంది. సీఎం కేసీఆర్ సడ్డకుడి(తోడల్లుడి) కుమారుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆయనను కూడా కలుపుకొంటే కేవలం ఒక్క కుటుంబానికి చెందిన వారే ఆరుగురు బీఆర్ఎస్ పాలిటిక్స్ లో ఉన్నట్టు లెక్క..