మరో వివాదంలో మై హోమ్ .. బఫర్ జోన్ లో బ్రిడ్జి నిర్మించిన యాజమాన్యం 

  • ​యూనిట్–4 ప్లాంట్ పర్మిషన్ కోసం తప్పుడు రిపోర్ట్ 
  • ఎన్నెస్పీ కాల్వ లేదని రిపోర్ట్ 

సూర్యాపేట, వెలుగు : మైహోం సిమెంట్స్ సంస్థ మరో వివాదంలో చిక్కుకుంది. ఇరిగేషన్ శాఖ మంత్రి ఇలాకాలోనే నాగార్జునసాగర్ కాల్వను మాయం చేసింది. తమ భూమిలో ఎలాంటి కాల్వ లేదంటూ అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా అనుమతులు నిరాకరిస్తూ ఇరిగేషన్ శాఖ అభ్యంతరం తెలుపడంతో విషయం వెలుగులోకి వచ్చింది.   

ఎన్నెస్పీ కాల్వ ద్వారానే సాగునీరు..

సాగర్ ఎడమ కాల్వ కింద మునగాల వద్ద ముక్త్యాల మెయిన్ బ్రాంచ్ కెనాల్ ఉంది. దీని కింద గుండ్లపల్లి, చింత్రియాల మేజర్ కాల్వలు ఉన్నాయి. ఈ కాల్వల ద్వారా ఆయకట్టు రైతుల పంటలకు సాగునీరు అందుతోంది. ముక్త్యాల బ్రాంచ్ కాల్వ 29 కిలో మీటర్ల వద్ద మేళ్లచెరువు రెవెన్యూ పరిధిలో రెండుగా చీలింది. ఒకటి గుండ్లపల్లి, మరొక్కటి చింత్రియాల మేజర్ కాల్వలుగా ఉన్నాయి. గుండ్లపల్లి కాల్వ మైహోమ్ భూముల మధ్యలోంచి16 కిలో మీటర్లు  ప్రవహించి కృష్ణానదిలో కలుస్తోంది. చింత్రియాల మేజర్ కాల్వ కూడా మైహోమ్​ పరిశ్రమ భూములకు 680 మీటర్ల దూరంలో ఉత్తరం దిక్కున ఉంది. ఈ కాల్వ 29 కిలో మీటర్లు ప్రవహించి చింత్రియాల వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. 

గుండ్లపల్లి మేజర్ కాల్వ గాయబ్..

ఇటీవల మైహోమ్ ​పరిశ్రమ యూనిట్–4 ప్లాంట్ నిర్మాణానికి 1,332 ఎకరాల భూమికి సంబంధించి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందేందుకు కేంద్ర పర్యావరణ సంస్థలకు అప్లై చేసుకుంది. కాగా, ఆయా సంస్థలు పలు అంశాలపై అభ్యంతరాలు తెలుపుతూ అనుమతులు నిలిపివేశాయి. దీనికి ఎన్నెస్పీ కాల్వ క్లియరెన్స్ పత్రాలను ఇవ్వకపోవడమే కారణంగా తేలింది. మరోసారి మార్చి 14న వివరణ సమర్పించిన మైహోం అసలు తమ పరిశ్రమ భూముల్లోంచి ఎలాంటి కాల్వ వెళ్లడం లేదని, పొరపాటున గుండ్లపల్లి కాల్వ వివరాలు అందించినట్టు క్షమాపణ కోరింది. ఆపై పరిశ్రమ భూమిలో ఉత్తరం వైపు మ్యాపులో 680 మీటర్ల దూరంలో చింత్రియాల మేజర్ కాల్వ ప్రవహిస్తున్నట్లు మరో రిపోర్టు అందజేసింది. ఇందుకు గుండ్లపల్లి కాల్వను మాయం చేసి, దాని స్థానంలో ఫీడర్ కెనాల్( పంట కాల్వ) ఉన్నట్లు తప్పుడు రిపోర్టు సృష్టించింది. 

మైహోమ్​ భూముల్లో నుంచే కాల్వ..

గుండ్లపల్లి మేజర్ కెనాల్ మేళ్లచెరువు రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 1,057 వద్ద ప్రారంభమై మైహోం భూముల్లో ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కు వైపు ప్రవహిస్తుంది. ఈ కాల్వకు ఉత్తరం వైపు దాదాపు 100 ఎకరాలు, దక్షిణం వైపు 140 ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమ విస్తరించింది. మై హోమ్ కు​ సంబంధించిన భూముల్లో దాదాపు 10 ఎకరాల్లో గుండ్లపల్లి మేజర్ కెనాల్ ప్రవహిస్తుంది. ఈ భూమి ఇప్పటికీ ఎన్నెస్పీ డిపార్ట్ మెంట్ పరిధిలోనే ఉంది. గుండ్లపల్లి కాల్వకు రెండు వైపులా 5 మీటర్ల పరిధిలో బఫర్ జోన్ ఉండగా, మైహోమ్​ నిర్మిస్తున్న యూనిట్-–4 ప్రాజెక్టుకు దారిగా మేజర్ కాల్వకు చెందిన బఫర్ జోన్ ఏరియాను(కాల్వ కట్టను)  వాడుకుంటోంది. ఇందులోంచి పరిశ్రమకు చెందిన భారీ వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో పలుచోట్ల కాల్వ ధ్వంసం అయ్యింది. 

ప్రభుత్వాన్ని మోసగించి అనుమతులు..

సర్వే నంబర్ 1,057లోని 110 ఎకరాల్లో పరిశ్రమకు సంబంధించిన ఫ్యాబ్రికేషన్ యూనిట్–4కు చెందిన పలు నిర్మాణాలు చేపట్టారు. ఫ్యాబ్రికేషన్ యూనిట్ వద్ద నుంచి భారీ యంత్రాలను తరలించేందుకు గతంలో గుండ్లపల్లి మేజర్ కెనాల్ పై నిర్మించిన బ్రిడ్జి (మేళ్లచెరువు –చౌటపల్లి) నుంచి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. డబుల్ లైన్ బ్రిడ్జిని కాల్వ 1.179 కిలో మీటర్ల వద్ద మైహోమ్ 2021లో నిర్మించింది.

ఇరిగేషన్ డిపార్ట్​మెంట్ నుంచి 2021 సెప్టెంబర్ లో డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణం కోసం అనుమతులు పొందింది. ఈ బ్రిడ్జి పరిశ్రమ రాకపోకలకు కాదని, దీనిని రైతుల అవసరాల కోసం నిర్మించినట్లు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించింది. బ్రిడ్జికి ఇరువైపులా మైహోం నిర్మాణాలు, భూములు ఉండగా సంస్థ సొంతంగా నిర్మించిన బ్రిడ్జితో రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది.

దీంతోపాటు గుండ్లపల్లి మేజర్ కాల్వపై నుంచి సున్నపురాయి ముడిసరుకును తరలించే బెల్ట్ కన్వేయర్ ను కూడా నిర్మించింది. ఈ  బ్రిడ్జిల నిర్మాణానికి  ఇరిగేషన్ శాఖ, కలెక్టర్ నుంచి ఎన్​వోసీలు గతేడాది మేలో తెచ్చుకుంది. ఎన్నెస్పీ కాల్వను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఫ్యాక్టరీపై చర్యలు తీసుకొని గుండ్లపల్లి మేజర్ కాల్వను పునరుద్ధరించాలని స్థానిక రైతులు కోరుతున్నారు. 

మైహోమ్​పై చర్యలు తీసుకుంటాం

గుండ్లపల్లి మేజర్ కాల్వ విషయంలో తప్పుడు రిపోర్టులు సృష్టించిన మైహోమ్​పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.

 రమేశ్, ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజినీర్, సూర్యాపేట జిల్లా