ఛత్తీస్ గఢ్‎లో మరో ఎన్ కౌంటర్.. మావోయిస్టు కీలక నేత అరెస్ట్

రాయ్‎పూర్: ఛత్తీస్ గఢ్‎ దండకారణ్యం తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. బీజాపూర్ జిల్లాలో గురువారం (జనవరి 16) జరిగిన భారీ ఎన్ కౌంటర్లో 12 మంది మావోయిస్టులు హతం కాగా.. తాజాగా శుక్రవారం (జనవరి 17) కాంకేర్ జిల్లాలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. చోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్ట్‎లకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మరణాల సంఖ్యపై అధికారుల వివరాలు వెల్లడించలేదు. 

కాగా, కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు సంచారిస్తున్నారన్న ఇంటలిజెన్స్ సమాచారం మేరకు డీఆర్జీ, బీఎస్ఎఫ్ జవాన్లు శుక్రవారం సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా దళాలు, మావోయిస్టులు తారసపడగా.. పరస్పరం కాల్పులు చోటు చేసుకున్నాయి. ప్లాటూన్ నెంబర్ 2 కమాండర్ ఆఫ్ మిలటరీ మోతీరామ్ అలియాస్ రాకేష్ ఉసెండీ అనే మావోయిస్టు కీలక నేతను అరెస్ట్ చేసినట్లు అధికారులు  వెల్లడించారు.  ఉసెండీపై 8 లక్షల రివార్డ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

ALSO READ | అరాచకమైన రివేంజ్ అంటే ఇదీ : పెట్రోల్ పోయలేదని.. బంకు కరెంట్ కట్ చేశాడు..!

ఎన్ కౌంటర్ స్థలంలో భద్రతా దళాలు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 2026 మార్చి వరకు దేశంలో నక్సలిజాన్ని అంతమొందించాలని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల కంచుకోటైన దండకారణ్యాన్ని భద్రతా దళాలు జల్లెడ పడుతూ నక్సలైట్లను అంతమొందిస్తున్నాయి. గడిచిన మూడు నాలుగు నెలల్లో దాదాపు 200 మంది మావోయిస్టులను ఎన్ కౌంటర్లో భద్రతా దళాలు హతం చేసినట్లు తెలుస్తోంది.