అటు ధాన్యం అమ్ముడుపోక కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. మరోవైపు సాగు కోసం చేసిన అప్పు తీర్చలేక మరికొంతమంది రైతులు తమ ప్రాణాలు బలితీసుకుంటున్నారు. తాజాగా నల్లగొండ జిల్లాలో మరో రైతు సూసైడ్ చేసుకున్నాడు. మునుగోడుకి చెందిన ఎరుకొండ యాదయ్య (45) అనే రైతు 15 గుంటల సొంత భూమితో పాటు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగుచేశాడు. అయితే రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలతో పత్తి పంట పూర్తిగా దెబ్బతింది. పత్తి చేను కోసం యాదయ్య దాదాపు రూ. 15 లక్షల వరకు అప్పు చేశాడు. అటు కౌలు చెల్లించలేక, ఇటు అప్పులు తీర్చలేక తీవ్ర మనస్థాపం చెందిన యాదయ్య.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాదయ్యకు భార్య, నలుగురు కూతుళ్లు ఉన్నారు. కూతుళ్లందరికి పెళ్లిళ్లు చేసిన యాదయ్య.. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కోలుకుంటున్నాడు. యాదయ్య మృతితో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి.
For More News..