HMPV : విజృంభిస్తున్న HMPV.. గుజరాత్ లో మరో కేసు నమోదు

భారత్ లో హెచ్ఎంపీవీ(human metapneumovirus ) వైరస్ విజృంభిస్తోంది. గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లాకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడికి హ్యూమన్ మెటాప్‌ న్యూమోవైరస్ ఇన్‌ఫెక్షన్ సోకడంతో రాష్ట్రంలో హెచ్‌ఎంపీవీ కేసుల సంఖ్య మూడుకు చేరుకుంది.

ప్రంతిజ్ తాలూకాకు చెందిన వ్యవసాయ కూలీల కుటుంబానికి చెందిన బాలుడు, ఒక ప్రైవేట్ లాబొరేటరీ నిర్వహించిన టెస్ట్ లో HMPV పాజిటివ్ అని తేలింది.  అయితే ఆరోగ్య అధికారులు అతని బ్లడ్ శాంపిల్స్ ను  ప్రభుత్వ ల్యాబ్‌కు పంపారు. ప్రస్తుతం హిమ్మత్‌నగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన చిన్నారిని ఇప్పటి వరకు అనుమానిత HMPV కేసుగా పరిగణించారు.

ఆ బాలుడికి HMPV సోకినట్లు ప్రభుత్వ ల్యాబ్ జనవరి 10న నిర్ధారించింది. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడని.. అతని పరిస్థితి నిలకడగా ఉందని సబర్‌కాంత జిల్లా కలెక్టర్ రతన్‌ కన్వర్ గధావిచరణ్ తెలిపారు. బాలుడు వెంటిలేటర్‌పై ఉన్నాడని ఆస్పత్రి వైద్యులు  తెలిపారు.

Also Read :- సంక్రాంతి తర్వాత తుఫాన్ ఏర్పడే అవకాశం

జనవరి 6న గుజరాత్‌లో మొదటి HMPV కేసు నమోదైంది. రాజస్థాన్‌కు చెందిన రెండు నెలల బాలుడు జ్వరం, ముక్కు దిబ్బడ, ముక్కు కారటం , దగ్గు వంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడు.  తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జి అయ్యాడు.

ఆందోళన అక్కర్లేదు: ఐసీఎంఆర్

అయితే హెచ్ఎంపీవీ వ్యాప్తిపై ఆందోళన అక్కర్లేదని ఐసీఎంఆర్ తెలిపింది. ఈ వైరస్​ పాతదేనని, ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉందని  స్పష్టం చేసింది. దేశంలో ఇన్ ఫ్లూయెంజా, తీవ్ర శ్వాసకోశ వ్యాధుల లాంటి కేసులు అసాధారణ రీతిలో ఏమీ లేవని పేర్కొంది.  ఒకవేళ వైరస్ వ్యాప్తి పెరిగినా, దాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ఎక్విప్ మెంట్ మన దగ్గర ఉన్నదని పేర్కొంది.