సాగర్ ఎడమ కాలువకు మరో గండి.. భయం గుప్పిట్లో ప్రజలు

నల్లగొండ: గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురుస్తోన్న కుండపోత వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన నుండి వస్తోన్న వరదతో పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడటంతో కృష్ణ నది ఉప్పొంగి ప్రవాహిస్తోంది. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో సాగర్ ఎడమ కాలువకు మరో గండి పడింది. ఆదివారం నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం 117వ కిలోమీటర్ వద్ద ఎడమ కాలువకు గండి పడగా.. తాజాగా మరో గండి పడింది. ఇవాళ (సోమవారం) వరద ఉధృతి మరింత పెరగడంతో119 కిలోమీటర్ వద్ద మరొక గండి పడింది.

Also Read:-హైదరాబాద్, విజయవాడ వెళ్లే వారికి బిగ్ అలర్ట్

 విషయం తెలుసుకున్న ఎన్ఎస్పీ సిబ్బంది సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల వెంటనే ఆపివేసినప్పటికీ  ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం సుమారు 7 అడుగుల మేర సాగర్ ఎడమ కాలువలో  నీటి ప్రవాహం సాగుతుంది.  నీటి ప్రవాహాన్ని తగ్గించేందుకు అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఘటన స్థలం వద్ద అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహయక చర్యలు చేపట్టారు. కాలువకు గండి పడి నీరు గ్రామాల్లోకి ప్రవేశిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. గండి పడిన స్థలాన్ని ఇవాళ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించినున్నట్లు సమాచారం. 


మరోవైపు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుండి వరద పోటెత్తింది. దీంతో అధికారులు 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 20 గేట్లు 15 ఫీట్లు మరో 6 గేట్లు10 ఫీట్లు హైట్ ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ప్రస్తుతం సాగర్‎కు 533157 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తుండగా.. అవుట్ ఫ్లో  541435 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం- 590.00 అడుగులు ( 312.0450 టీఎంసీలు) కాగా ప్రస్తుత నీటి మట్టం 587.20 (305.6242 టీఎంసీలు) అడుగుల వద్ద ఉంది.