
గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఇంటర్ చేంజ్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ నార్సింగి వద్ద ఓఆర్‌ఆర్‌పై నిర్మించిన ఇంటర్ చేంజ్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
నార్సింగి వద్ద రూ.29.50 కోట్లతో ఇంటర్ చేంజ్ నిర్మించామని, ఓఆర్‌ఆర్‌పై ఇది 20వ ఇంటర్ చేంజ్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. త్వరలో మరొకటి అందుబాటులోకి వస్తుందన్నారు. ఔటర్‌పై వాహనాల స్పీడ్ లిమిట్‌ను 120 కిలోమీటర్లకు పెంచామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు పక్కన సర్వీస్ రోడ్డును అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ చెప్పారని అన్నారు.
శంషాబాద్ మునిసిపాలిటీకి రూ.50 కోట్లు మంజూరు చేశామని వివరించారు. మూసీ నదిపై 14 బ్రిడ్జిల నిర్మాణాలకు అనుమతులిచ్చామని తెలిపారు. త్వరలోనే వాటికి శంకుస్థాపన చేయనున్నామని, ఐదు టెండర్ల దశలో ఉన్నాయని చెప్పారు. శంషాబాద్ నుంచి నాగోల్ వరకు 55 కిలోమీటర్ల మేర మూసీపై ఎక్స్‌ప్రెస్ వే నిర్మించాలన్న ప్రతిపాదన ఉందన్నారు. అంతేకాకుండా.. మూసీ నదిని మరింత బ్యూటిఫికేషన్ కూడా చేస్తామన్నారు. బీహెచ్‌ఈఎల్ నుంచి కందుకూరు ఫార్మాసిటీ వరకు మెట్రో రైలు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.
రూ.10వేల కోట్ల వ్యయంతో హైదరాబాద్ నగరానికి మెట్రోను విస్తరించాల్సి ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. మెహిదీపట్నంలో స్కై వాక్ నిర్మాణం కోసం భూమి ఇవ్వాలని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను అడిగామన్నారు. జూబ్లీ బస్టాండ్ నుంచి షామీర్ పేట వరకూ స్కైవే నిర్మించాల్సి ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా హైదరాబాద్ ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
గత తొమ్మిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని, కనీసం హైదరాబాద్ లో అభివృద్ధికి భూములైన ఇవ్వండి అని మంత్రి కేటీఆర్ కోరారు. కేంద్ర ప్రభుత్వం 150 ఎకరాలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అందుకు బదులుగా 500 ఎకరాలు ఇస్తుందని స్పష్టం చేశారు. మోడీ తెలంగాణకు వచ్చే ముందే రక్షణశాఖకు చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి భూములు ఇప్పిస్తారని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై అంతర్జాతీయ ప్రమాణాలతో సైకిల్‌ట్రాక్ ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే నెల ఆగస్టులో సైకిల్ ట్రాక్ ను ప్రారంభిస్తామన్నారు.