- నిర్మాణానికి బీసీసీఐని ఒప్పించినం: సీఎం రేవంత్
- త్వరలో రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీ
- క్రీడాకారులకు భరోసా కోసమే నిఖత్, సిరాజ్‌కు ఉద్యోగాలు
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్‌లో మరో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తామని, ది బెస్ట్ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐని ఒప్పించామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కొద్దిరోజుల్లోనే భూమిని కేటాయిస్తామని, హైదరాబాద్‌లోని బ్యాగరి కంచెలో ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి సమీపంలోనే ఈ స్టేడియం నిర్మాణం చేపడుతామని స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని నిర్ణయించిందని, అందుకే క్రీడలకు తాజా బడ్జెట్‌లో రూ. 321 కోట్లు కేటాయించామన్నారు. బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగాలకు ఉద్దేశించిన బిల్లుపై శుక్రవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. హర్యానా, పంజాబ్ సహా వివిధ రాష్ట్రాల స్పోర్ట్స్ పాలసీలను అధ్యయనం చేసి, రాష్ట్రంలో బెస్ట్ పాలసీని తీసుకొస్తామని తెలిపారు. ‘‘వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో స్పోర్ట్స్ పాలసీని చర్చకు పెడ్తం. ఇందుకు ప్రతిపక్షాలు సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తం.
వ్యసనాల నుంచి యువతను బయటకు తీసుకువచ్చేందుకు క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని వెల్లడించారు. ప్రపంచంలో ఏ క్రీడలు జరిగినా తెలంగాణలో రాష్ట్రం నుంచి శిక్షణ పొందిన క్రీడాకారులు మెడల్స్ తీసుకువచ్చే విధంగా రూపొందించే విధివిధానాలకు అందరి మద్దతు ఉండాలని ఆయన కోరారు.
అవన్నీ ప్రైవేట్ ప్రోగ్రామ్స్‌కే పరిమితమైనయ్
హైదరాబాద్‌లో గతంలో నిర్మించిన స్టేడియాలు ప్రైవేట్, రాజకీయ కార్యక్రమాలకే పరిమితమయ్యాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించిన స్టేడియాలు క్రీడలు లేక కళ తప్పాయని తెలిపారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ స్టేడియం సినిమా ఫంక్షన్లకు పరిమితమైందని, గచ్చిబౌలి స్టేడియం పెళ్లిళ్లకు, పేరంటాలకు పోతున్నాయని అన్నారు.
ఇక సరూర్‌నగర్ స్టేడియాన్ని రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు ఉపయోగిస్తున్నారని.. ఎల్బీ స్టేడియంలో క్రీడలు తగ్గి రాజకీయ కార్యకలాపాలు పెరిగాయని వ్యాఖ్యానించారు. గతంలో పుల్లెల గోపీచంద్‌కు అకాడమి కోసం ల్యాండ్ కేటాయిస్తే చాలా మంది క్రీడాకారులు తయారైయ్యారని సీఎం అన్నారు. ప్రైవేటు వాళ్లు ఏర్పాటు చేస్తేనే ఆ విధంగా ఉంటే ప్రభుత్వం నుంచి సహకరిస్తే మరింతగా అభివృద్ధి సాధ్యమన్న ఉద్దేశంతోనే క్రీడలకు ప్రాధాన్యం కల్పించామని తెలిపారు.
బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ చెప్పినట్లు మండలానికి ఓ మినీ స్టేడియం నిర్మిస్తే ఉపయోగంగా ఉంటుందని, కానీ రాష్ట్రంలో భూముల విలువ బాగా పెరిగి.. ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయని ఆయన అన్నారు. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు లేకుండా పోయాయని తెలిపారు. ఏ మండల కేంద్రంలోనైనా ప్రభుత్వ భూమి ఉంటే మినీ స్టేడియంల నిర్మాణ కోసం బడ్జెట్ కేటాయించేందుకు తాము సిద్ధమని ఆయన ప్రకటించారు.
తెలుగు వర్సిటీకీ సురవరం ప్రతాపరెడ్డి పేరు
అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రతిపాదిస్తూ సీపీఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డి లెటర్‌ను అందజేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. తెలంగాణ వైతాళికుడు, కవి, గోల్కొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు.
అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడానికి తాము సుముఖంగా ఉన్నామని చెప్పారు. సెక్యూరిటీ గార్డులకు కూర్చునే హక్కు చట్టం కల్పించాలని ఎమ్మెల్యే కూనంనేని కోరగా.. తమిళనాడులో అమలు చేసిన విధివిధానాలను చూసి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
క్రీడాకారులకు భరోసా కోసమే ఉద్యోగాలు
చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే తప్పకుండా ఉద్యోగ భద్రత ఉంటుందనే భరోసా కల్పించడానికే రాష్ట్రానికి చెందిన బాక్సర్ నిఖత్ జరీన్‌కు , అంతర్జాతీయ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కు డీఎస్పీ స్థాయి గ్రూప్-1 ఉద్యోగం ఇస్తున్నామని సీఎం వెల్లడించారు.