ఫ్యూచర్ ఐటీ హబ్ నియోపోలిస్ .. హెచ్ఎండీఏ ప్లానింగ్

ఫ్యూచర్ ఐటీ హబ్ నియోపోలిస్ .. హెచ్ఎండీఏ ప్లానింగ్

హైదరాబాద్, వెలుగు: కోకాపేట నియోపోలిస్ లేఅవుట్ ​కేంద్రంగా మరో ఐటీ హబ్​రూపుదిద్దుకుంటోంది.  రెండేండ్ల కింద 532 ఎకరాల్లో హెచ్ఎండీఏ ఇక్కడ లేఅవుట్ వేసి ప్లాట్లను విక్రయించింది. ఎన్నో కంపెనీలు నియోపోలిస్​లో భూములను కొనుగోలు చేశాయి. ఈ లేఅవుట్ ప్రభుత్వానికి రూ.కోట్ల ఆదాయం సమకూర్చిపెట్టింది. ఆ టైమ్​లో అంతర్జాతీయ స్థాయిలో కోకాపేట పేరు మార్మోగింది. 

ఎకరం రూ.100 కోట్ల వరకు పలుకుతోందని వార్తలు రావడంతో ఈ ప్రాంతం అందరి దృష్టిని ఆకర్షించింది. త్వరలో పలు మల్టీనేషనల్​కంపెనీలు, ఐటీ సంస్థలు ఏర్పాటు కాబోతున్నాయని, హైటెక్​సిటీ తర్వాత మరో కీలక ప్రాంతంగా నియోపోలిస్​మారబోతుందని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 

మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ఫోకస్​ పెట్టారు. ఇప్పటికే ఆరు, నాలుగు లేన్ల రోడ్ల నిర్మాణం పూర్తయింది. సెంట్రల్ ల్యాండ్​స్కేపింగ్ పూర్తికావస్తోంది. అంతర్గత రోడ్లతోపాటు, డ్రైనేజీ లైన్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. పనులన్నీ పూర్తయితే సమీప భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.