పంజాబ్‌లో మరో జలియన్‌వాలా బాగ్
అమృత్ సర్ జిల్లా అజ్నాలాలోనూ బ్రిటిషర్ల నరమేధం
246 మంది ఇండియన్ సైనికుల హత్య
2014లో బావిలో బయటపడ్డ అస్థిపంజరాలు
దేశ విభజన అల్లర్లనాటివి కావచ్చన్న చరిత్రకారులు
1857 నాటివని సైంటిఫిక్ గా తేల్చిన సీసీఎంబీ సైంటిస్టులు
హైదరాబాద్, వెలుగు : పంజాబ్ రాష్ట్రం అమృత్ సర్ జిల్లాలో జలియన్ వాలాబాగ్ లాంటి మరో నరమేధం వెలుగు చూసింది. మొదటి స్వాతంత్ర్య పోరాటంలో చరిత్రకెక్కని మరో నెత్తుటి అధ్యాయం బయటపడింది. అమృత్ సర్ జిల్లా అజ్నాలా పట్టణంలో ఎనిమిదేళ్ల క్రితం ఓ బావిలో గుట్టలుగా బయటపడిన అస్థిపంజరాల చిక్కుముడిని హైదరాబాద్ లోని సీసీఎంబీ సైంటిస్టులు విప్పారు. ఈ అస్థిపంజరాలన్నీ1857 మొదటి స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్‌సైన్యం చేతిలో హత్యకు గురైన ఇండియన్ సైనికులవేనని తమ సైంటిఫిక్ రీసెర్చ్ లో తేలినట్లు ప్రకటించారు. వీరంతా బ్రిటిష్ – ఇండియన్ ఆర్మీకి చెందిన 26వ బెంగాల్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌కు చెందిన సైనికులని సీసీఎంబీ సైంటిస్టులు నిర్ధారించారు. దీంతో వీరంతా ఇండియా – పాకిస్తాన్ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో చనిపోయినవారేనని చరిత్రకారులు చేస్తున్న వాదన తప్పని తేలిపోయింది. సీసీఎంబీ సైంటిస్టుల రీసెర్చ్ వివరాలు గురువారం ‘ఫ్రంటియర్స్ ఇన్ జెనెటిక్స్’ జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి.
165 ఏండ్ల నాటివని తేల్చిన్రు
అజ్నాలా పట్టణంలో 2014లో ఓ పాత బావిని తవ్వుతుండగా 246 మందికి చెందిన అస్థిపంజరాలు, పుర్రెలు, దవడలు, దంతాలు, వెన్నెముకలు, చేతులు, వేళ్ల ఎముకలు, తొడ ఎముకలు, మెడ ఎముకలతోపాటు కొన్ని నాణేలు, ఆభరణాలు, మెడల్స్ బయటపడ్డాయి. ఒకే చోట గుట్టలుగా అస్థిపంజరాలు బయటపడడంతో ఈ నరమేధానికి సంబంధించిన మూలాలను సైంటిఫిక్ గా తెలుసుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం పంజాబ్ యూనివర్సిటీ ఆంత్రోపాలజిస్టు జెఎస్ సెహ్రావత్ బృందానికి బాధ్యతలు అప్పగించింది. సీసీఎంబీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ కె.తంగరాజ్ బృందం, బీర్బల్ సాహ్ని ఇనిస్టిట్యూట్, బెనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధకులు కూడా ఇందులో భాగస్వాములయ్యారు. అస్థిపంజరాల డీఎన్ఏ, దంతాలపై పరిశోధన చేసి.. ఇవన్నీ165 ఏళ్ల నాటి అవశేషాలుగా గుర్తించారు. వీరంతా 21 ఏళ్ల నుంచి 49 ఏళ్ల మధ్య వయస్సు వారేనని నిర్ధారించారు.
ఫ్రెడరిక్ హెన్రీ బుక్ లో ప్రస్తావన
అజ్నాలా మారణహోమం గురించిన ప్రస్తావన 1857లో అమృత్ సర్ డిప్యూటీ కమిషనర్ గా పనిచేసిన బ్రిటీష్ పోలీస్ అధికారి ఫ్రెడరిక్ హెన్రీ కూపర్ రాసిన పుస్తకంలో కూడా ఉంది. మియాన్ మీర్ కంటోన్మెంట్‌లో (ప్రస్తుత పాకిస్థాన్‌లోని లాహోర్‌లో) పని చేస్తున్న ఇండియన్ సైనికులను గొడ్డు మాంసం, పంది మాంసంతో కూడిన కాట్రిడ్జ్‌లను వాడాలని బ్రిటిష్ అధికారులు బలవంతం చేశారని ఈ పుస్తకంలో ఆయన వివరించారు. మొదటి స్వాతంత్ర్య పోరాటం ప్రారంభం కావడంతో కొంతమంది బ్రిటీష్ అధికారులను చంపిన తర్వాత ఈ కంటోన్మెంట్ కు చెందిన వందలాది మంది ఇండియన్ సైనికులు పంజాబ్ (ప్రస్తుతం మనదేశంలోనిది) వైపు పారిపోయారు. కానీ వారంతా బ్రిటీష్ సైన్యం చేతికి చిక్కి చివరకు అజ్నాలా సమీపంలో హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో 282 మంది ఇండియన్ సైనికులు మరణించారని పుస్తకంలో ఉంది. 1857 జులై 31న ఈ మారణహోమం జరిగినట్లు ఇందులో పేర్కొన్నారు. అయితే, ఇంత పెద్ద మారణకాండ జరిగినప్పటికీ.. బ్రిటీష్ సైన్యం ఈ విషయం బయటకు రానీయకుండా జాగ్రత్తపడింది. దీంతో1919లో ఇదే అమృత్ సర్ లో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండ మాదిరిగా అజ్నాలా నరమేధం గురించి ఎవరికీ తెలియకుండా మరుగునపడిపోయింది.
చిత్రహింసలు పెట్టి చంపేసిన్రు
బావిలో దొరికిన అస్థిపంజరాలకు చెందిన 86 పుర్రెల్లో ప్రతిదానికీ కనుబొమ్మల మధ్య గాయం గుర్తులు ఉన్నాయి. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చిచంపడం వల్లే ఇలాంటి గాయాలు అయ్యాయని రీసెర్చ్ ఆర్టికల్ లో ఆంత్రోపాలజిస్ట్ సెహ్రావత్ పేర్కొన్నారు. బావిలో తవ్వకాలు జరిపినప్పుడు స్టోన్ బుల్లెట్లు కూడా దొరికాయని, వీటిని బ్రిటీష్ వాళ్లు19వ శతాబ్దంలో బందీలుగా ఉన్న ప్రజలను చంపడానికి వాడారని తెలిపారు. అస్థి పంజరాల అవశేషాలను చూస్తుంటే, మృతదేహాలను పైనుంచి బావిలోకి విసిరేసినట్లు తెలుస్తోందన్నారు.