నిన్న భర్త.. నేడు భార్య.. షార్‌లో వరుస మరణాల కలకలం

శ్రీహరి కోటలోని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (షార్‌)లో వరుస ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. 24 గంటల్లోనే కానిస్టేబుల్, ఎస్సై ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది. సీఐఎస్‌ఎఫ్‌ సీఐ వికాస్‌సింగ్‌ సతీమణి ప్రియాసింగ్‌ (27) నర్మద గెస్ట్‌ హౌస్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మంగళవారం వికాస్‌ సింగ్‌ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోగా.. సమాచారం అందుకున్న అతని కుటుంబసభ్యులు శ్రీహరికోటకు చేరుకున్నారు. అనంతరం వారందరూ అక్కడే ఉన్న నర్మద అతిథి భవన్ లో బస చేశారు. ఈ సమయంలోనే వికాస్ సింగ్ భార్య ప్రియా సింగ్ గదిలోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి సమాచారం అందించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట సర్వజన ఆసుపత్రికి తరలించారు. భర్త మరణాన్ని తట్టుకోలేకే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు భావిస్తున్నారు.

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వికాస్‌ సింగ్‌, ప్రియా సింగ్‌ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తల్లిదండ్రుల మరణంతో చిన్నారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వికాస్ సింగ్ మృతిపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2015 బ్యాచ్‌కు చెందిన ఆయన ట్రైనింగ్ అనంతరం ముంబైలోని బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో విధులు నిర్వహించాడు. గతేడాది నవంబరులోనే బదిలీపై షార్ కు వచ్చారు. ముంబైలో విధులు నిర్వహిస్తున్న సమయంలో వికాస్ పై  క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.