కాంగ్రెస్ ఖాతాలో మరో కీలక పదవి
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (ఐడీసీఎంఎస్) ఛైర్మన్ పదవికి సోమవారం నిర్వహించిన ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జి.తారాచంద్‌నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గాంధారి సింగిల్ విండో ప్రెసిడెంట్ పి.సాయన్న కూడా ఈ పదవికి నామినేషన్ వేసి విత్‌డ్రా చేసుకోవడంతో ఎన్నిక యూనానిమస్ అయింది. ఐడీసీఎంఎస్‌లో ఓటు హక్కుగల డైరెక్టర్లు ఏడుగురు ఉన్నారు. గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఎలక్షన్ నిర్వహించిన డిప్యూటీ రిజిస్ట్రార్ పి.రామ్మోహన్ నామినేషన్ దాఖలు చేయడానికి ఉదయం 11 గంటల వరకు గడువు విధించారు. తారాచంద్‌నాయక్, పి.సాయన్న ఇద్దరు నామినేషన్లు వేయడంతో టెన్షన్ నెలకొంది.
పోలింగ్ అనివార్యమయ్యే పరిస్థితి నెలకొనడంతో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి రంగంలోకి దిగారు. ఇద్దరినీ నగరంలోని తన ఇంటికి పిలిపించుకొని మాట్లాడగా.. సాయన్న నామినేషన్ ఉపసంహరించుకున్నారు. విత్‌డ్రా టైం ముగిసిన తర్వాత తారాచంద్‌నాయక్ నామినేషన్ ఒక్కటే మిగలడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ ఆఫీసర్ రామ్మోహన్ ప్రకటించి ఆయనకు సర్టిఫికేట్ అందించారు. చైర్మన్‌గా గెలిచిన తారాచంద్ నాయక్ డిచ్పల్లి మండలం రాంపూర్ సింగిల్ విండో సొసైటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే నాలుగున్నరేండ్ల పదవీ కాలం ముగిసిన చైర్మన్ పోస్టు తుది గడువు వచ్చే జనవరితో ముగియనుంది