
హైదరాబాద్‌లో రోజురోజుకు లిఫ్ట్ ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. గత నెలలో జరిగిన లిఫ్ట్ ప్రమాదాల వల్ల దాదాపు ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే.. భాగ్యనగరంలో మరో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా లిఫ్ట్ కుప్పకూలడంతో అందులోని ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆసిఫ్‌నగర్‌లోని నాకో షామ్స్ రెసిడెన్సీలో ఆదివారం (ఏప్రిల్ 6) రాత్రి ఈ ప్రమాదం జరిగింది.
భవనం ఐదవ అంతస్తులో లిఫ్ట్‌లోకి ఆరుగురు వ్యక్తులు ఎక్కారు. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్‌కు వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో లిఫ్ట్‌లోని ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. భారీ శబ్ధంతో లిఫ్ట్ కూలిపోవడం గమనించిన స్థానికులు వెంటనే అందులోని ఆరుగురిని రక్షించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
లిఫ్ట్ ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీసి.. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కూడా ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. లిఫ్ట్ భద్రతా ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. నగరంలో వరుస లిఫ్ట్ ప్రమాదాల వేళ చోటు చేసుకున్న తాజా ప్రమాదంతో సిటీలోని భవన భద్రతా ప్రమాణాలపై మరోసారి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.