భార్య వేధింపులతో మరో వ్యక్తి ఆత్మహత్య.. ముంబైలో ఓ హోటల్‌‌‌‌లో ఉరి వేసుకుని బలవన్మరణం

భార్య వేధింపులతో మరో వ్యక్తి ఆత్మహత్య.. ముంబైలో ఓ హోటల్‌‌‌‌లో ఉరి వేసుకుని బలవన్మరణం

ముంబై: ఇటీవలి కాలంలో భార్యల వేధింపులు భరించలేక భర్తలు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా ముంబైలోనూ ఓ వ్యక్తి తన భార్య, అత్త వేధింపులతో సూసైడ్​ చేసుకున్నాడు. గత శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైలో యానిమేటర్​గా పనిచేస్తున్న నిశాంత్ త్రిపాఠి(41)  గత శుక్రవారం సహారా హోటల్‌‌‌‌లో ఓ రూమ్​లో దిగాడు. 

ఆ రోజే డోర్​ బయట ‘డు నాట్ డిస్టర్బ్’ బోర్డు పెట్టాడు. మూడు రోజుల వరకూ గది నుంచి బయటకు రాకపోవడంతో హోటల్ ​సిబ్బంది మాస్టర్​ కీతో రూమ్​ఓపెన్​చేసి చూడగా.. బాత్రూంలో ఉరివేసుకొని కనిపించాడు. వెంటనే హోటల్​ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిశాంత్ త్రిపాఠి తాను పనిచేస్తున్న కంపెనీ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో సూసైడ్ నోట్‌‌‌‌ను అప్‌‌‌‌లోడ్ చేశాడు. 

అందులో తన భార్యను ఉద్దేశిస్తూ.. "హాయ్​ బేబ్.. నువ్వు దీన్ని చదివే సమయానికి నేను ఉండను. నా చివరి క్షణాల్లో ప్రతిదానికీ నేను నిన్ను ద్వేషించాను. కానీ, ఇక నుంచి అలా ఉండదు. ఈ క్షణం నుంచి నేను ప్రేమను ఎంచుకుంటాను" అని రాశాడు. అలాగే, "నా చావుకు నువ్వు, మీ అమ్మ కారణమని నా తల్లికి తెలుసు. కాబట్టి, మీరు ఆమెను సంప్రదించవద్దు. ఆమెను ప్రశాంతంగా దుఃఖించనివ్వండి" అని లెటర్​లో పేర్కొన్నాడు. దీంతో నిశాంత్​ను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు అతని భార్య అపూర్వ పారిఖ్, అత్త ప్రార్థన మిశ్రాపై  పోలీసులు కేసు నమోదు చేశారు.

బతికున్న శవంలా మారా.. నిశాంత్​ తల్లి ఆవేదన

మహిళా హక్కుల కార్యకర్త అయిన నిశాంత్ తల్లి నీలం చతుర్వేది తన కొడుకు మరణం పట్ల దుఃఖంతో ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. "ఈరోజు నేను జీవశ్చవంలా మారాను. నా కొడుకుతో పాటే నా జీవితం ముగిసింది. ఈ విషాద సమయంలో నాకు, నా కూతురుకు ధైర్యాన్ని కల్పించండి" అని కోరారు.