ఛత్తీస్‎గఢ్‎లో మరో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోయిస్టుల మృతి

ఛత్తీస్‎గఢ్‎లో మరో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోయిస్టుల మృతి

రాయ్‎పూర్: దండకారణ్యంలో మరోసారి తుపాకీల మోత మోగింది. ఛత్తీస్‎గఢ్‎ బీజాపూర్ జిల్లాలో ఆదివారం (ఫిబ్రవరి 9) భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఘటన స్థలంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఎన్ కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల్లో అగ్రనేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు సమావేశం అయినట్లు భద్రతా దళాలకు ఇంటలిజెన్స్ సమాచారం అందింది. దీంతో వెంటనే అప్రమత్తమైన బలగాలు బీజాపూర్ జిల్లాలో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే భద్రతా దళాలు, మావోయిస్టులు తారపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య పరస్పరం కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతం అయ్యారు. మరికొందరు నక్సలైట్లు గాయాల పాలుకాగా.. కొందరు జవాన్లు సైతం గాయపడ్డట్లు సమాచారం. 

మావోయిస్టులు తీవ్రంగా ప్రతిఘటిస్తుండటంతో ఘటన స్థలంలో ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్‎కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల ఛత్తీస్ గఢ్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో 17 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. మావోయిస్టు అగ్రనేత చలపతి కూడా ఈ ఎన్ కౌంటర్లో హతమయ్యాడు. ఈ నష్టం నుంచి ఇంకా కోలుకోని మావోయిస్టు పార్టీకి రోజుల వ్యవధిలోనే మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది.