ఛత్తీస్‎గఢ్‎లో మరో భారీ ఎన్ కౌంటర్.. మావోయిస్ట్ కీలక నేత మృతి

ఛత్తీస్‎గఢ్‎లో మరో భారీ ఎన్ కౌంటర్.. మావోయిస్ట్ కీలక నేత మృతి

ఛత్తీస్‎గఢ్ దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. తాజాగా ఇవాళ (సెప్టెంబర్ 24) ఛత్తీస్‎గఢ్ నారాయణ పూర్ జిల్లాలో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన భీకర కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. నారాయణపూర్ ఎన్ కౌంటర్‎ను బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ దృవీకరించారు. ఎన్ కౌంటర్‎లో మొత్తం ముగ్గురు మావోయిస్ట్‎లు మృతి చెందినట్లు ఆయన నిర్ధారించారు. ఇందులో ఇద్దరు పురుషులు, ఒక మహిళా నక్సలైట్ ఉండగా.. మృతులను దండ కారణ్యం స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన రూపేష్, జగదీష్ గా గుర్తించారు.

ALSO READ | ఛత్తీస్‎గఢ్‎లో మరో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు హతం

రూపేష్ గడ్చిరోలి జిల్లా దండ కారణ్యం కీలక నేత అని.. అతడిపై  రూ.25 లక్షల రివార్డ్ ఉందని తెలిపారు. మరో నక్సలైట్ జగదీష్ డీవీసీఏం నేత కాగా.. అతడి తలపై రూ.16 లక్షల రివార్డ్ ఉందన్నారు. మృతి చెందిన మహిళా మావోయిస్ట్ వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఎన్ కౌంటర్‎లో హతమైన ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్న పోలీస్ బలగాలు.. ఘటనా స్థలంలో ఏకే 47, ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ బోర్ గన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

కాగా, నిన్న కూడా (సెప్టెంబర్ 23) ఇదే నారాయణ పూర్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే.  ఘటనలో ముగ్గురు మావోలు హతమయ్యారు. ఇదిలా ఉండగానే.. ఇవాళ ఎన్ కౌంటర్‎లో మరో ముగ్గురు నక్సలైట్లు మరణించడం గమనార్హం. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించినా నాటి నుండి దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేతలో భద్రతా దళాలు స్పీడ్ పెంచాయి.