తెలంగాణ కోసం మరో ఉద్యమం తప్పదు

సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణ కావాలంటే ఉద్యమం చేయాల్సిందే

తెలంగాణ ఉద్యమానికి దశ, దిశ నిర్ణయించింది 1969 నాటి పోరాటమే. రాష్ట్రాన్ని తెలంగాణ బిడ్డలు పాలించకపోవడం వల్ల మన ఉద్యోగాలు, నీళ్లు, నిధులు దోపిడీకి గురవుతున్నాయని, తెలంగాణ ప్రజలకు చెందడం లేదని తొలిసారి జాగృతం చేసింది అప్పటి ఉద్యమకారులే. మన హక్కులు సాధించుకోవాలంటే పోరాటమే మార్గమని మార్గనిర్దేశం చేశారు. దశాబ్దాల పోరాటం, వందల మంది బలిదానాల తర్వాత స్వరాష్ట్రం సాధించుకున్నాం. కొన్ని వందల సంవత్సరాలు నిజాం, జమీందార్లు, జాగీర్దారులు, ఫ్యూడల్స్ పాలనలో బానిసలుగా మగ్గి కనీసం చదువు కూడా తెలియకుండా జీవనం సాగించిన ప్రజల అభివృద్ధికి స్వరాష్ట్రంలో బాటలు పడతాయని కలలు కన్నాం. అణగారిన ప్రజలకు న్యాయం చేస్తూ, తెలంగాణను సస్యశ్యామలంగా తీర్చిదిద్దుకుంటామని ఉద్యమకారులంతా ఆశపడ్డారు. కానీ స్వరాష్ట్రంలో కేసీఆర్ గద్దెనెక్కిన తర్వాత ఆ కలలన్నీ కల్లలుగా మిగిలిపోయాయి. ఉద్యమ ఆకాంక్షలన్నింటినీ.. అదే పాత ఫ్యూడల్ భావజాలంతో కుటుంబ పాలన తెచ్చి.. టీఆర్ఎస్ పార్టీ ధ్వంసం చేసేసింది. నేడు మళ్లీ ఉద్యమం మొదలుపెట్టి.. సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు కోసం మిగిలి ఉన్న 1969 తెలంగాణ ఉద్యమకారులు పోరాడాల్సిన అవసరం వచ్చింది.

ఉద్యమ ఆశయాలకు వ్యతిరేకంగా పాలన

తెలంగాణ ఏర్పడిన తర్వాత దళితుడు సీఎంగా సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణ ప్రభుత్వం ఏర్పడుతుందని కేసీఆర్​ రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేశారు. ఏక కుటుంబ పాలన అనేది ఉండదని ప్రచారం చేశారు. రాష్ట్రానికి దళితుడిని తొలి సీఎంగా చేస్తానని, తాను కాపలా కుక్కలా ఉంటానని కేసీఆర్ కూడా చెప్పారు. తాను కుటుంబ పాలనకు వ్యతిరేకమని, తన కొడుకు అమెరికాలో ఉన్నాడని, అతడికి రాజకీయాలతో సంబంధం లేదని, తాను బడుగు సామాజిక కార్యకర్తగా ఉంటూ ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తానని నమ్మించాడు. రాష్ట్రం సాధించుకున్నాక తనకు నమ్మకస్తులుగా ఉండేవాళ్లకు టికెట్లు ఇచ్చి, గెలిచిన తర్వాత తానే గద్దెనెక్కి.. ఉద్యమ ద్రోహులకు సైతం మంత్రి పదవులు కట్టబెట్టారు. ఆరున్నరేండ్లుగా ఉద్యమ ఆశయాలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారు.

ముందు నుంచే పక్కా ప్లాన్ తో..

తెలంగాణ సాధన కోసం 1969 నాటి ఉద్యమకారులు అనేక సంస్థల పేరుతో పోరాటం చేస్తున్న సమయంలో కేసీఆర్ ఉమ్మడి ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ తీరు తెన్నుల్ని పరిశీలించి.. దీర్ఘకాలిక ప్రణాళికలు ప్రిపేర్ చేసుకుని ఆ పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో చేరారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో రాజకీయంగా పోరాడితేనే ఉద్యమ లక్ష్యాన్ని సాధించుకోగలమంటూ తెలంగాణ సాధ న సమితి, విమోచన సమితి ఇలా రకరకాల పేర్లతో ఉన్న సంస్థలను రద్దు లేదా విలీనం చేయించుకున్నారు. ఆ తర్వాత తన వాళ్లకే పదవులు ఇచ్చి.. టీఆర్ఎస్ శాఖల్ని విస్తరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడే ఏకైక పార్టీగా గుర్తింపు తెచ్చుకునేందుకు బాటలు వేసుకున్నారు. తనవాళ్లతో గ్రామగ్రామాన మీటింగ్స్ పెట్టించి.. తన యాస, భాషలతో జనాన్ని ఆకట్టుకున్నారు. తనను వ్యతిరేకించిన వాళ్లను తెలంగాణ ద్రోహులన్న ముద్రవేశారు. కేసీఆర్ మాత్రమే తెలంగాణ రాష్ట్ర సాధనను సాకారం చేయగలడని నమ్మించేందుకు తాను ముందుగా ఎంచుకున్న ప్రణాళికలతో ప్రచారం సాగించారు. వందలాది మంది విద్యార్థులు, యువత బలిదానాల తర్వాత తెలంగాణ ఏర్పడిన విషయాన్ని మరపించేలా.. తొలి ఎన్నికల్లో తాను డిజైన్ చేసుకున్న స్కీమ్స్ ప్రకటించారు. ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత తాను కాకుండా ఎవరైనా ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఆగమైతదని ప్రచారం చేసి.. ఆ పదవిని దక్కించుకున్నారు. బంగారు తెలంగాణ సాకారం చేస్తానని మాటలు చెప్పిన ఆయన.. పదవి దక్కిన తర్వాత తన కుటుంబం కోసం తప్ప రాష్ట్రం గురించి పట్టించుకోనేలేదు.

ఉద్యమ ఆశయాలు సర్వనాశనం

రాష్ట్రమంతా దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉంది. ఇక్కడ గ్రావిటీతో నీళ్లు పారించడం కష్టం. అందుకే కాకతీయ రాజులు వేలాది చెరువులు, కుంటలు తవ్వించి ప్రతిగ్రామానికి సాగు, తాగునీటి సౌకర్యం కల్పించారు. గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను కాకతీయ రాజులు కొన్ని వందల ఏండ్ల క్రితమే ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గోదావరి జలాలు, ఎత్తిపోతల పథకాల ద్వారా గొలుసుకట్టు చెరువులను జలాశయాలుగా మారుస్తామని, రాష్ట్రంలో సాగుకు అనువైన భూమిని పంట పొలాలుగా మారుస్తామని, ఇంటింటికీ తాగునీరు అందిస్తామని గ్రామగ్రామానా ప్రచారం చేశాం. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే మిషన్ కాకతీయ ద్వారా గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేసే పథకాన్ని ప్రవేశపెట్టడాన్ని ఉద్యమకారులంతా స్వాగతించారు. అయితే ఈ పథకం ద్వారా ఎలాంటి పర్సంటేజి రావడం లేదని కేసీఆర్, కాంట్రాక్టర్ల బిల్లులను ఆపేసి ఆ పథకాన్ని నీరుగార్చారు. అప్పటికే ప్రకటించిన గోదావరి ఎత్తిపోతల పథకాలను తుంగలో తొక్కి ‘మెగా’ ఎత్తిపోతల పథకాలకు లక్షలాది కోట్లతో శ్రీకారం చుట్టి, అవే అత్యుత్తమ ప్రాజెక్టులని తన చెప్పుచేతల్లో ఉండే ఇంజనీర్లతో ప్రజలను నమ్మించారు. ఆ ప్రాజెక్టులు మొదలు పెట్టిన కొద్దిరోజులకే వాటి అంచనాలను భారీగా పెంచేశారు. అందుకు కారణం కేసీఆర్​ కాంట్రాక్టర్ల నుంచి వేల కోట్ల రూపాయలు పర్సంటేజిగా తీసుకోవడమే. ‘సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణ ప్రభుత్వం’ ఏర్పాటు కోసం మలి దశ ఉద్యమానికి ప్రజలను సిద్ధం చేయవలసిన బాధ్యత మనపై ఉన్నది. ఆ దిశగా వారిని సమాయత్తపరచాలి.

ఉద్యమానికి ప్రజలను సిద్ధం చేయాలి

1969 ఉద్యమకారులు వందలాది మంది తెలంగాణ ఏర్పాటును కనులారా చూడకుండానే కన్నుమూశారు. మరికొంతమంది తెలంగాణ రాష్ట్ర ఫలితాలు అనుభవించకుండానే అమరులయ్యారు. మిగిలిన వారిలో చాలామందికి సరైన వైద్యం లేక మంచానపడి దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. కొట్లాడి తెచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యమకారుల కష్టాల గురించి విన్నవించినా సమస్యలను పరిష్కరించలేదు. 1969 ఉద్యమకారుల సమస్యలను పరిష్కరిస్తామని, వారి త్యాగాలను గుర్తించి స్వాతంత్ర్య సమరయోధులకు ఇస్తున్న పెన్షన్, ఇతర సౌకర్యాలు వర్తింపచేస్తామని రాష్ట్ర బీజేపీ పదాధికారులు తీర్మానించడాన్ని స్వాగతిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతికి, బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోరి సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేసే నాయకులను గుర్తించి, వారి ద్వారా ఉద్యమించాలి. దీనికి విప్లవ సంస్థలు, పౌరహక్కుల సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు మద్దతు తెలపాలి.

ప్రజల ఆశలను నాశనం చేశారు

ఉద్యమకారులు ఆశించిన నీళ్లు, నిధులు, ఉద్యోగాలను కేసీఆర్ సర్వనాశనం చేస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజల ముందుంచాల్సిన బాధ్యత 1969 ఉద్యమకారులపై ఉన్నది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను టీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నాభిన్నం చేస్తోంది. అభివృద్ధి పథకాలకు డబ్బుల్లేవు. చేపట్టిన పథకాలకు అప్పులు చేయవలసిన పరిస్థితి. ఒకవైపు కరోనా, మరోవైపు వరదలతో జనం బాధపడుతుంటే వారిని ఆదుకోకుండా, సెక్రటేరియట్ ను కూలగొట్టి కోట్లు వెచ్చించి, కొత్తది కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది. ప్రగతి భవన్ పై కోట్లు ఖర్చు చేసి పోలీసులను కాపలాగా పెట్టి ప్రజల డబ్బును దుబారా చేస్తోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ప్రజలు సమన్యాయం పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వ అప్రజాస్వామిక పథకాలన్నింటికీ వ్యతిరేకంగా ప్రజలను ఉద్యమకారులు కదిలించాలి.

మేచినేని కిషన్‌రావు, మాజీ మంత్రి, 1969 తెలంగాణ ఉద్యమకారుల సమితి అధ్యక్షుడు

For More News..

హెచ్‌‌‌‌ఐవీ వ్యాప్తిలో రెండో స్థానంలో తెలంగాణ

గ్రేటర్ వార్: ఒక్కో బూత్​లో మినిమం ఓట్లు పడేలా ప్లాన్​

ఫండ్స్​ ఇయ్యకున్నా పనుల్జేయాలె.. సర్పంచులపై ఆఫీసర్ల ఒత్తిడి