తెలంగాణ సంపద కాపాడేందుకు మరో ఉద్యమం

త్యాగం మాదే, రాష్ట్రం మాదే, రేపు రాబోయే పాలన మాదే అంటున్నారు తెలంగాణ ఉద్యమకారులు. ఈ ఏడేండ్ల పాలనలో సంపదను దోచుకోవడమేగాదు ఖజానాను ఖాళీ చేసిన పాలకులు రాష్ట్రాన్ని దివాళా తీయించారు. వేల మంది బలిదానాలకు కారణమైన తెలంగాణ ద్రోహులకు మంత్రివర్గంలో సగం పదవులిచ్చారు. టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్​ను తాగుబోతన్న కడియం, నేనుగిట్ల తలచుకొంటే కేసీఆర్​ సిటీలుంటడా?అన్న తలసాని ఇప్పుడు టీఆర్ఎస్​ వాళ్లతో కల్సి వాని నాలుక కోస్తా, వీని కాళ్లిరగ్గొడతా అంటున్నారు. అసలు ఈ తెలంగాణ ద్రోహులకు మాట్లాడే హక్కుందా? బలిదానాలు మర్చిపోయారా? నిరుద్యోగుల ఆత్మహత్యలు కనబడడం లేదా? ప్రతిపక్షాలు సిగ్గు శరం ఉందా? అని తిడుతుంటే, కోర్టులు మొట్టికాయలేస్తుంటే మమ్ముల్ని కాదనుకొంటున్నారా? సిగ్గు లేదా జీడి గింజా అంటే నల్లగున్నా నాకేం సిగ్గని చెప్పినట్టుంది ఈ పాలకుల తీరు. మొన్నటి దాకా ప్రభుత్వంలో ముఖ్య పదవులు చేసినవారు బయటికి వచ్చి మీ దోపిడీని, అవినీతిని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తుంటే మీ మొహం ఎక్కడ పెట్టుకున్నారు? ఎందుకు మీరు అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారు? ఇక మీద, దళితుల మీద, నిరుద్యోగుల మీద, ఆదివాసీల మీద చూపుతున్న వివక్షను అడ్డుకొని, తెలంగాణ సంపదను రక్షించుకోడానికి ఉద్యమకారులం మరో ఉద్యమానికి నడుం బిగిస్తున్నాం.
త్యాగాలను అవమానిస్తున్నారు
1952, 1969 ఉద్యమాల్లో 377 మంది ఉద్యమకారులు పోలీస్ కాల్పుల్లో అమరులైనారు. తెలంగాణ రాదనే నిరాశతో 1,200 మంది బలిదానం చేసుకొన్నారు. అప్పటికీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించింది. అంతే స్థాయిలో కాంగ్రెస్ మంత్రి ఒకరు తెలంగాణ ఉద్యమకారులు రైలురోకో చేస్తుంటే దాడులు చేసి కొందరిని చంపారు. ఉద్యమకారుల మీద రాళ్లు విసిరిన ఒకాయనకు ఎమ్మెల్సీ పదవి వరించింది. తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించి, గద్దెనెక్కిన కేసీఆర్​ తెలంగాణ ద్రోహులు ఆరుగురు ఎమ్మెల్యేలను టీఆర్ఎస్​లో కలుపుకొని వారికి కీలక పదవులిచ్చి అమరుల త్యాగాలను అవమానించారు. జైలుపాలైన 1969 ఉద్యమకారులకు పెన్షన్ మాటెత్తకుండా వారి త్యాగాలను అపహాస్యం పాల్జేస్తున్నారు. అమరుల పేరా అంతర్జాతీయ స్థాయిలో స్మృతిచిహ్నం ఏర్పాటు చేస్తున్నట్టు డిజైన్ తో పాటు ప్రకటించిన గులాబీ అధినేత​అంతర్జాతీయంగా అమరవీరుల కీర్తిని అప్రతిష్ట పాలుజేస్తున్నారు. ఏడేండ్లుగా ముఖ్యమంత్రి అవినీతి, బంధుప్రీతితో తెలంగాణ సంపద కొల్లగొట్టి తనవాళ్లకు పంచుతున్నారు. అన్ని పదవులు వారికే కట్టబెడుతున్నారు. 1969 ఉద్యమకారులకు పెన్షన్లు ఇవ్వకుండా, నిరుద్యోగులకు ఉపాధి కల్పించకుండా పాలిస్తున్నారు. తొలి తెలంగాణ ఉద్యమ స్వర్ణోత్సవాల సందర్భంగా సోమవారం ఖమ్మంలో తలపెట్టిన మహాసభలో ఈ దుష్ట ప్రభుత్వం మీద పోరాడేందుకు ప్రతిన బూనుతున్నాం.
ఉద్యమంలో మీరా? మేమా?
“ఉద్యమంలో మేం ఉన్నాం. మీరెక్కడ?” అంటూ ఇటీవల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. “ఉద్యమం ఏ ఒక్కని సొత్తో కాదు’’ అంటూ మేచినేని కిషన్ రావు ఓ పత్రికలో వ్యాసమే రాశారు. ట్యాంక్​ బండ్ మీద జరిగిన మిలియన్ మార్చ్ లో కొందరి విగ్రహాలను కూల్చినప్పుడు కేసీఆర్​గానీ, కేటీఆర్ గానీ లేరు. ఆ కారణంగానే ఉద్యమాల్లో మీ పాత్ర లేదని, సకల జనుల సమ్మె, రైల్​రోకో, రాస్తారోకోలో కూడా మీ పాత్ర ఏమీ లేదని వాదిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో టీఆర్ఎస్​ పాత్ర సూదిమొన మోపినంత లేదని, అప్పుడు కేసీఆర్​ను సంప్రదించింది లేదని గులాం నబీ ఆజాద్ కుండ బద్దలుకొట్టారు. రాష్ట్ర ఏర్పాటుకు మేం విత్తనాలు వేసి, నీళ్లు పెట్టి ఎరువు వేసి పంట పండించాం. ఆ పంటను టీఆర్ఎస్​ కోసుకుపోయిందని ఆజాద్ అన్నారు. తొలి, మలి తెలంగాణ పోరాటంలో దూకి సర్వస్వం కోల్పోయిన విద్యార్థులు, ఉద్యమకారులు ‘త్యాగం ఉద్యమకారులది, భోగం ఉద్యమ ద్రోహులదా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు.