ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు మరో కొత్త ఎత్తిపోతల పథకం మంజూరు.. ఎక్కడంటే..

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు మరో కొత్త ఎత్తిపోతల పథకం మంజూరు.. ఎక్కడంటే..

ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రజల దాహార్తి, కరువును తీర్చేందుకు మరో కొత్త ఎత్తిపోతల పథకం మంజూరు చేసింది ప్రభుత్వం. కొత్త పథకాన్ని ప్రభుత్వం మంజూరు చేసినట్లుగా రాష్ట్ర ప్రణాళికా సంఘం చైర్మన్ డా.చిన్నారెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు.  ఆదివారం (మార్చి2) సర్వే పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

వనపర్తి నియోజకవర్గానికి ‘కాశీంనగర్ ఎత్తిపోతల పథకం’ మంజూరు చేసినట్లు పత్రికా ప్రకటన విడుదల చేశారు. వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆరు గ్రామాలు, 13 గిరిజన తాండాల్లోని దాదాపు నాలుగు వేల ఎకరాలకు సాగు నీరు అందించే కాశీంనగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఈ మేరకు శనివారం ప్రభుత్వం మెమో నంబర్ 1712/ ప్రాజెక్ట్స్ - II/ A2/ 2025, తేదీ 1-3-2025 ద్వారా జారీ చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ శ్రీ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలిపారు.

ఈ లిప్ట్ ఇరిగేషన్ కిద కాశీం నగర్, జయన్న తిరుమలాపురం, మున్ననూరు, అప్పాయిపల్లి, దత్తయిపల్లి, అంజనగిరి గ్రామాలతోపాటు మరో 13 గిరిజన తాండాలకు నాలుగు వేల ఎకరాలకు సాగు నీరు అందనుందని తెలిపారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సహా ఇతర ప్రతిపాదిత నీటి వనరులకు ఈ ప్రాంతం ఎత్తుగా ఉండటం వల్ల కాశీం నగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను  ప్రభుత్వం మంజూరు చేసిందని ఈ సందర్భంగా తెలిపారు. ఎన్నో ఏళ్లుగా చివరి ఆయకట్టుకు సాగు నీరు రాక ఇబ్బందులు పడుతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందని చిన్నారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.