యాదాద్రి, వెలుగు: ఎన్నికల సమీపించిన సమయంలో యాదాద్రి జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటైంది. దీంతో జిల్లాలో మండలాల సంఖ్య 18 కి చేరింది. ప్రభుత్వం వలిగొండ మండలంలోని 32 పంచాయతీల్లోని పదింటిని విభజించి ‘మత్స్యాద్రి వేములకొండ ఆరూర్’ మండలాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఈ నెల 7న జీవో 366ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జీవో సోమవారం పబ్లిక్ డొమైన్‌లోకి అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వం కొత్త మండలాలు ఏర్పాటు చేస్తున్న సమయంలో యాదాద్రి జిల్లాలోని ఆరూర్, వేములకొండ, రఘునాథపురం గ్రామాల నుంచి మండలాల డిమాండ్ మొదలైంది. ఏడాదికిపైగా ఆయా గ్రామాల్లో ప్రజలు నిరసనలు కొనసాగిస్తున్నారు.
అయితే వలిగొండలోని వేములకొండలో మత్స్యగిరి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి టెంపుల్ ఉండడం, ఆరూర్ పెద్ద పంచాయతీ కావడంతో మత్స్యాద్రి వేములకొండ అరూర్ పేరుతో మండలాన్ని ఏర్పాటు చేశారు. కాగా, రాజాపేట మండలంలోని రఘునాథపురం ప్రజలు ఆశలు మాత్రం నెరవేరలేదు. తమ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వాళ్లు 426 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆరూర్ మండలం ఏర్పాటు కావడం, ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రఘునాథపురం మండలం ఏర్పాటు చేసే అవకాశం లేకుండాపోయింది.