RCB vs RR Eliminator: గెలిచేది బెంగుళూరే.. మ్యాచ్ ఏకపక్షం: మాజీ దిగ్గజం జోస్యం

RCB vs RR Eliminator: గెలిచేది బెంగుళూరే.. మ్యాచ్ ఏకపక్షం: మాజీ దిగ్గజం జోస్యం

అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న ఎలిమినేటర్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏకపక్షంగా విజయం సాధిస్తుందని భారత మాజీ స్టార్ సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పారు. కీలక మ్యాచ్ ఎక్కడ వన్‌సైడ్ గేమ్‌గా మారుతుందోనని తాను భయపడుతున్నట్లు లిటిల్ మాస్టర్ పేర్కొన్నారు.

రాజస్థాన్ జట్టు తలపడిన గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడిపోగా.. ఒకటి వర్షం కారణంగా రద్దయ్యింది. వారు చివరి మ్యాచ్ గెలిచి దాదాపు నెల రోజులు కావొస్తోంది. ఏప్రిల్ 27న లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన వారి విజయం సాధించారు. అక్కడి నుంచి వరుస ఓటములు వారిని బాధించాయి. సన్‌రైజర్స్, ఢిల్లీ, చెన్నై, పంజాబ్ చేతిలో ఓటమి పాలవ్వగా.. కోల్‌కతాతో జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. మరోవైపు, బెంగళూరు ప్రదర్శన వీరికి భిన్నం. ఆశలు లేని స్థితి నుంచి వరుసగా ఆరు విజయాలు సాధించి ప్లేఆఫ్స్‌కు దూసుకొచ్చారు. పూర్తి ఆత్మ విశ్వాసంతో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
"రాజస్థాన్ జట్టు చివరి నాలుగైదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒకరిద్దరు మినహా వారి ఎవరూ పెద్దగా రాణించట్లేరు. కావున కేకేఆర్ ఆటగాళ్లు చేసినట్లు ఏదైనా ప్రత్యేకంగా చేస్తే తప్ప వారు గెలవలేరు. మరోవైపు, బెంగళూరు జట్టు వరుస విజయాలతో మంచి ఊపు మీదుంది. మరో వన్‌సైడ్ గేమ్‌గా మారవచ్చని నా అభిప్రాయం. నా భయం ఏమిటంటే, అసాధారణమైన క్రికెట్‌ ఆడుతున్న ఆర్సీబీ ఎక్కడ ఏకపక్షంగా ముగుస్తుందో అన్నదే.." అని గవాస్కర్ స్టార్ స్పోర్ట్స్‌తో అన్నారు.

ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటిముఖం పట్టనుండగా, గెలిచిన టీమ్‌ క్వాలిఫయర్‌-2లో హైదరాబాద్‌తో తలపడుతుంది.