- ఆకట్టుకోనున్న మ్యూజికల్ ఫౌంటేయిన్
- చిన్నారుల కోసం ఆట పరికరాలు
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ సిటీ సిగలో త్వరలో మరో పార్క్ చేరనుంది. నగర ప్రజలకు ఆహ్లాదం, ఆనందం పంచేలా సిటీ నడిబొడ్డున 6 ఎకరాల్లో రూ.12 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో మల్టీపర్పస్ పార్క్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది. పార్క్‌లో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటేయిన్‌కు ఇప్పటికే ట్రయల్ రన్ చేశారు. ఇందిరాచౌక్ జంక్షన్ వెంట నిర్మించిన ఈ పార్క్‌ను కొత్త సంవత్సరంలో ప్రారంభించేందుకు కరీంనగర్ మున్సిపల్ పాలకవర్గం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
స్పెషల్ అట్రాక్షన్ ఇవే..
ఈ పార్క్‌లో ఆహ్లాదకర వాతావరణం కలిగేలా ల్యాండ్ స్కేపింగ్ గ్రీనరీ, రకరకాల పూల మొక్కలు, కలర్ ఫుల్ మ్యూజికల్ ఫౌంటేయిన్లు, చిన్నారులకు రకరకాల ఆట వస్తువులు, యువత, పెద్దలకు ఈపీడీఎం వాకింగ్ ట్రాక్, చారిత్రాత్మక సినిమాల ప్రదర్శనకు అంఫీ థియేటర్, సరదాగా కూర్చొని ముచ్చటించేందుకు గజిబో మొదలైనవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి.
ఇందులో మ్యూజికల్ ఫౌంటేయిన్‌ను రూ.2 కోట్లతో ఏర్పాటు చేశారు. పాటలకు అనుగుణంగా మ్యూజిక్ తో వాటర్ చేసే డ్యాన్స్ చూపరులను ఆకట్టుకోనుంది. ప్రతి రోజు రాత్రి అరగంట పాటు మ్యూజికల్ ఫౌంటేయిన్ ప్రదర్శన ఉండనుంది. పార్క్‌లోనే వివిధ రకాల ఆహార పదార్థాల కోసం ఫుడ్ కోర్టులు, క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు.
జనవరిలో సెకండ్ వీక్‌లో ప్రారంభిస్తాం
నగరంలో స్మార్ట్ సిటీ కింద చేపట్టిన సుమారు రూ.100 కోట్ల విలువైన పనులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. మల్టీ పర్పస్ పార్క్ సిటీ జనానికి ఆహ్లాదం పంచనుంది. మ్యూజికల్ ఫౌంటేయిన్ అందరినీ ఆకట్టుకోనుంది. అంఫీ థియేటర్‌లో నాటికలు ప్రదర్శించవచ్చు. ప్రొజెక్టర్ తో సినిమాలు చూడవచ్చు. 500 కేవీ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. జనవరి రెండో వారంలో పార్క్ ప్రారంభిస్తాం.
- యాదగిరి సునీల్ రావు, కరీంనగర్ మేయర్