భద్రాచలం ఘటనలో మరొకరు మృతి

భద్రాచలం ఘటనలో మరొకరు మృతి
  • శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తిని బయటకు తీసుకొచ్చిన రెస్క్యూ టీమ్‌
  • హాస్పిటల్‌కు తరలించేలోపే మృతి
  • ఇంకా దొరకని ఉపేందర్‌ డెడ్‌బాడీ

భద్రాచలం, వెలుగు : భద్రాచలం పట్టణంలో ఆరు అంతస్తుల బిల్డింగ్‌ కుప్పకూలిన ఘటనలో మరో వ్యక్తి చనిపోయాడు. బుధవారం మధ్యాహ్నం భవనం కూలిపోవడంతో తాపీ మేస్త్రీ ఉపేందర్‌రావు చనిపోగా చల్లా కామేశ్‌ అనే కార్మికుడు శిథిలాల కింద చిక్కుకున్నాడు. విషయం తెలుసుకున్న సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్​రెస్క్యూ టీంలు ఘటనాస్థలానికి చేరుకొని శిథిలాల తొలగింపు చేపట్టారు. సుమారు 12 గంటల పాటు శ్రమించి కామేశ్‌ను బయటకు తీసుకొచ్చారు. కానీ తీవ్రంగా గాయపడిన అతడు హాస్పిటల్‌కు తరలించేలోపే చనిపోయాడు. కలెక్టర్​జితేశ్​వి.

పాటిల్, ఎస్పీ రోహిత్​రాజ్, ఏఎస్పీ విక్రాంత్​కుమార్​సింగ్, ఆర్డీవో దామోదర్ గురువారం తెల్లవారుజాము వరకు ఘటనాస్థలం వద్దే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. మరోవైపు ఘటన జరిగిన టైంలోనే చనిపోయిన తాపీ మేస్త్రీ పడిశాల ఉపేందర్‌రావు ఆచూకీ ఇంకా తెలియరాలేదు. దీంతో అతడి కుటుంబసభ్యులు గోదావరి బ్రిడ్జి సమీపంలో జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.

ప్రమాదానికి కారణమైన శ్రీపతి ఫౌండేషన్‌ నిర్వాహకులు శ్రీపతి శ్రీనివాసరావుపై క్రిమినల్​కేసు పెట్టాలని, మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు గడ్డం స్వామి, షాబీర్​పాషా, రావులపల్లి రవికుమార్, రావులపల్లి రాంప్రసాద్, దాసరి శేఖర్, అలవాల రాజా డిమాండ్​ చేశారు. ఆందోళనకు దిగారు. అనంతరం ఆర్డీవో దామోదర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.