45 రోజుల వ్యవధిలో ఒకే ఇంట్లో నలుగురు మృతి..
అంతుచిక్కని మిస్టరీ
కరీంనగర్ : గంగాధర మండల కేంద్రంలోని ఓ కుటుంబంలో మరో వ్యక్తి మృతిచెందడంతో మిస్టరీ నెలకొంది. ఇప్పటికే భార్య, ఇద్దరు పిల్లలు చనిపోగా..గత రాత్రి వాంతులు చేసుకుని భర్త కూడా కరీంనగర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దాదాపు నెలన్నర వ్యవధిలోనే ఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందడం బంధువుల్లో ఆందోళన నెలకొంది. నవంబర్ 16న కుమారుడు, డిసెంబర్ 4న కూతురు, డిసెంబర్ 16న భార్య మమత మృతిచెందారు. తాాజాగా శ్రీకాంత్ చనిపోయాడు.
అసలేం జరిగింది..?
ఇంతకుముందే వేముల శ్రీకాంత్ భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు. వీరి ముగ్గురి మృతిపై కరీంనగర్ జిల్లా గంగాధర పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే తాజాగా వేముల శ్రీకాంత్ కూడా చనిపోయాడు. వీరి మరణాలకు అసలు కారణమేంటి..? ఏదైనా వ్యాధా..? లేక ఇతర కారణాలు ఉన్నాయా..? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. గత రాత్రి శ్రీకాంత్ కూడా ఇదే తరహాలో వాంతులు చేసుకుని చనిపోవడం మరో సంచలనంగా మారింది. చనిపోయిన వారిలో వేముల శ్రీకాంత్, ఆయన భార్య మమత, కూతురు అమూల్య(6), కుమారుడు అద్వైత్ (20నెలల) ఉన్నారు.
హైదరాబాద్ లోని ఆస్పత్రుల్లో వైద్యం అందించినా మిగతా ముగ్గురి ప్రాణాలు దక్కలేదు. తల్లీ, పిల్లల మృతికి అసలు కారణం ఏంటనే విషయం నిర్ధారణకాకముందే గత రాత్రి శ్రీకాంత్ మృతిచెందాడు. ఇప్పటికే జిల్లా మలేరియా అధికారులు, స్థానిక వైద్య సిబ్బంది బాధిత కుటుంబ సభ్యుల రక్త నమూనాలను సేకరించి..హైదరాబాద్ లోని ల్యాబ్ కు పంపించినా ఎలాంటి ఫలితం రాలేదు. మృతుల ఇంటి ఆవరణలోని బావి నీటి నమూనాలను పరీక్షించి బాగానే ఉన్నాయని అధికారులు తేల్చారు. మమత, ఆమె ఇద్దరు బిడ్డలకు పరీక్షలు చేశారు. వారికి ఎలాంటి వ్యాధులు ఉన్నట్లు నిర్దారణ కాలేదు. మరి వారు ఎలా చనిపోయారు..? అనేది అంతుచిక్కడం లేదు. మొదట కుమారుడు, ఆ తర్వాత కూతురు, తల్లి మమత ఒకే తరహాలో వాంతులు చేసుకుని మరణించారు. తాజాగా శ్రీకాంత్ కూడా వాంతులు చేసుకుని మృతిచెందాడు. గతంలో చనిపోయిన వారి పోస్టుమార్టం రిపోర్టుల వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు.
శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా..?
శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాంత్ బంధువు దేవేందర్ కథనం ప్రకారం.. శ్రీకాంత్ ట్యాబెట్లు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడు బావ దేవేందర్ తెలియజేశాడు. భార్య, పిల్లల వైద్య ఖర్చుల కోసం దాదాపు 20 లక్షల వరకూ ఖర్చు చేసినా వారు బతకలేదని, ఇదే క్రమంలో శ్రీకాంతే తమ కూతురు, మనవడు, మనవరాలిని చంపాడని మమత తల్లిదండ్రులు ఆరోపించడంతో తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. దాంతో పాటు ఓ కాలేజీలో లెక్చరర్ గా చేస్తున్న శ్రీకాంత్ ను.. చైర్మన్ విధుల నుంచి తొలగించడంతో కొంతకాలంగా మనోవేదనతో ఉన్నాడని, ఇవన్నీ బాధలు తట్టుకోలేక ట్యాబెట్లు వేసుకుని శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు
శ్రీకాంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంనగర్ జిల్లా ప్రభుత్వ మార్చురీకి తరలించారు. శ్రీకాంత్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు ద్వారా దర్యాప్తు చేస్తామని గంగాధర పోలీసులు చెబుతున్నారు. గతంలో చనిపోయిన శ్రీకాంత్ భార్య, పిల్లల మృతికి సంబంధించి ఇంకా ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాల్సి ఉందని గంగాధర ఎస్ఐ తెలియజేశారు.