సిద్దిపేట జిల్లా : సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం మునిగడప గ్రామ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి కూడా చనిపోయాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వెంకటేష్ ను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే.. అప్పటికే ఆయన పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ గాంధీలో చనిపోయాడు.
అసలేం జరిగింది..?
భువనగిరి యాదాద్రి జిల్లా బొమ్మల రామారం బీబీనగర్ గ్రామానికి చెందిన సమ్మయ్య అనే వ్యక్తి.. తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో దైవ దర్శనం కోసం వేములవాడకు వెళ్లారు. దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి ఇంటికి వెళ్తుండగా..సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం మునిగడప గ్రామం వద్దకు రాగానే కారు అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న కెనాల్ లో కారు పడిపోయింది. కారు అదుపు తప్పడంతోనే కెనాల్ లో పడిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారును నడుపుతున్న సమ్మయ్యతో పాటు ఆయన భార్య స్రవంతి, పిల్లలు భవ్యశ్రీ, లోకేష్, అత్త రాజమణి ప్రమాద స్థలంలోనే చనిపోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సమ్మయ్య మామ వెంకటేష్ ను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి వెంకటేష్ ను తీసుకెళ్లారు. అప్పటికే వెంకటేష్ పరిస్థితి విషమించి.. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయాడు.
బాధితులు భువనగిరి యాదాద్రి జిల్లా బొమ్మల రామారం బీబీనగర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం నుండి మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.