హనుమకొండ, వెలుగు: పదో తరగతి హిందీ పేపర్ లీక్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న బండి సంజయ్ బెయిల్ రద్దు కోసం హనుమకొండ ఫోర్త్ ఎంఎం కోర్టులో ప్రభుత్వం మరోసారి పిటిషన్ దాఖలు చేసింది. రెండు రోజుల కిందే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి వద్ద పిటిషన్ వేయగా..బెయిల్ మంజూరు చేసిన ఫోర్త్ ఎంఎం కోర్టులోనే పిటిషన్ వేయాల్సిందిగా పీడీజే రిటర్న్ చేశారు. దీంతో మంగళవారం ఫోర్త్ ఎంఎం కోర్టులో పిటిషన్దాఖలు చేయగా.. సెక్షన్లు సరిగా మెన్షన్ చేయలేదంటూ కోర్టు రిజెక్ట్ చేసింది.
ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బుధవారం ఫోర్త్ ఎంఎం కోర్టులో మరోసారి పిటిషన్ ఫైల్ చేయగా సీఆర్ఎల్ ఎంపీ 230/2023ను కోర్టు అడ్మిట్ చేసింది. నిందితుల తరఫు అడ్వకేట్లకు శుక్రవారంలోగా నోటీసులివ్వాలంటూ ఆదేశించింది. కాగా, డిఫెన్స్ లాయర్లకు నోటీసులు అందిన తరువాత వారు కౌంటర్ వేసే అవకాశం ఉంది. ఇదిలాఉంటే జువైనల్ హోం లో ఉన్న ఏ4 తో పాటు మరో ఇద్దరు నిందితులు ఏ7 సుభాశ్, ఏ8 పోగు శశాంక్ బెయిల్ పిటిషన్ పై బుధవారం వాదనలు జరిగాయి. దీంతో మెజిస్ట్రేట్ ఆర్డర్స్ ను గురువారానికి పోస్ట్ చేశారు.