అసలేం జరుగుతోంది..?: ఆమ్‎స్టర్‎డ్యామ్‎లో మరో విమాన ప్రమాదం

అసలేం జరుగుతోంది..?: ఆమ్‎స్టర్‎డ్యామ్‎లో మరో విమాన ప్రమాదం

దక్షిణ కొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 179 మంది మృతి చెందిన ఘటనలో సహయక చర్యలు కొనసాగుతుండగానే.. నార్వేలో మరో విమాన ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన విమానం అదుపు తప్పి రన్ వే పక్కకు దూసుకుపోయింది. అధికారుల వివరాల ప్రకారం.. 2024, డిసెంబర్ 29న కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్‎కు చెందిన బోయింగ్ విమానం ఓస్లో విమానాశ్రయం నుండి ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు బయలుదేరింది.

 టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఫ్లైట్ హైడ్రాలిక్ సిస్టమ్‎లో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలట్లు  ఓస్లోకు దక్షిణాన 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాన్‌డెఫ్‌జోర్డ్ ఎయిర్ పోర్టుకు విమానాన్ని మళ్లించారు. ఈ క్రమంలోనే శాన్‌డెఫ్‌జోర్డ్ ఎయిర్ పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతుండగా అదుపు తప్పి రన్‌వే నుండి పక్కకు దూసుకెళ్లింది. 

రన్ వే పక్కనున్న గడ్డిలోకి వెళ్లి విమానం ఆగిపోయింది. ఈ ఘటన సమయంలో విమానంలో 182 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు, ఎయిర్ లైన్స్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ వారంలో కజకిస్థాన్‎లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 

ప్రయాణికులతో వెళ్తున్న విమానం కుప్పకూలిపోవడంతో దాదాపు 40 మంది మరణించారు. ఈ ఘటన మరువకముందే ఆదివారం దక్షిణ కొరియాలో మరో విమానం ప్రమాదం జరిగి 179 మంది మృతి చెందారు. ఈ రెండు ఘటనలు ఇలా ఉండగానే.. తాజాగా నార్వేలో మరో ఫ్లైట్ యాక్సిడెంట్ చోటు చేసుకోవడంతో విమానాల్లో ప్రయాణించాలంటే జంకుతున్నారు ప్రజలు.