కొండాయి వద్ద కొట్టుకుపోయిన మరో రోడ్డు

కొండాయి వద్ద కొట్టుకుపోయిన మరో రోడ్డు
  •     మల్యాల, కొండాయి, ఐలాపురం గ్రామాలకు నిలిచిన రాకపోకలు 
  •     కొనసాగుతున్న ఐరన్​ వంతెన పనులు
  •     బోటు ఏర్పాటు చేయాలని కోరుతున్న ప్రజలు 

ఏటూరు నాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి వద్ద జంపన్న వాగు వంతెనకు ఇరువైపులా సిమెంట్​పైపులతో ఏర్పాటు చేసిన రెండు తాత్కాలిక మట్టి రోడ్లు వర్షానికి కొట్టుకుపోయాయి. గత ఏడాది భారీ వరదలకు జంపన్న వాగు వంతెన కూలిపోవడంతో జాతర నేపథ్యంలో మేడారానికి రాకపోకలు పునరుద్ధరించడానికి అప్పటి ప్రభుత్వం బ్రిడ్జికి రెండు పైపులా టెంపరరీ మట్టి రోడ్లు వేయించింది. గత వారం కురిసిన వర్షాలకు ఒక రోడ్డు కొట్టుకుపోగా, మంగళవారం రాత్రి భారీ వర్షానికి ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరదతో మరో రోడ్డు కొట్టుకు పోయింది. దీంతో వాగుకు అవతలి వైపు గ్రామాలైన మల్యాల, కొండాయి, ఐలాపురం గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 

కొనసాగుతున్న ఐరన్​వంతెన పనులు

గత ఏడాది వరదల కారణంగా కొండాయి గ్రామంలో ఎనిమిది మంది చనిపోయారు. ఇది దృష్టిలో పెట్టుకుని మళ్లీ వరదలు వస్తే భారీ నష్టం సంభవిస్తుందనే అంచనాతో ప్రస్థుత కాంగ్రెస్​ప్రభుత్వం ఐటీడీఏ ఇంజినీరింగ్​ విభాగం ద్వారా రూ.35 లక్షలతో 20 రోజుల కింద తాత్కాలిక ఐరన్ ​వంతెన నిర్మాణ పనులు చేపట్టింది. ఇది పూర్తయితేనే అవతలి గ్రామాలకు రాకపోకలు సాగే పరిస్థితి నెలకొంది. అయితే, వరద ఉధృతి ఉన్నన్ని రోజులు రాకపోకలు సాగవని, అత్యవసర సమయాల్లో వాగు దాటేందుకు ఐటీడీఏ ఆధ్వర్యంలో బోటు ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.