
పాలకుర్తి, వెలుగు : పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే రూ. 150 కోట్లు ఖర్చు చేశామని, మరో రూ. 100 కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. జనగామ జిల్లా పాలకుర్తి, దర్దెపల్లిలో సోమవారం జరిగిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. పాలకుర్తిలో డిగ్రీ కాలేజీ ఏర్ప్రాటు చేసి, వచ్చే విద్యా సంవత్సరం నుంచే క్లాస్‌లు ప్రారంభం అయ్యేలా చూస్తామన్నారు. పాలకుర్తి చారిత్రక, అధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్చుకోలేని కాంగ్రెస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
అంతకుముందు ఎర్రబెల్లికి కార్యకర్తలు, మహిళలు డప్పు చప్పుళ్లు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. అనంతరం సహపంక్తి భోజనం చేశారు. సర్పంచ్‌లు వీరమనేని యాకాంతారావు, ఇమ్మడి ప్రకాశ్, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం అభివృద్ధి పనులు, దేవాలయాల పునరుద్ధరణపై క్యాంప్ ఆఫీస్‌లో రివ్యూ నిర్వహించారు. పనులను ఆగస్టు 25లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనులను పూర్తి చేయడంతో పాటు, ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.