తిమ్మాపూర్ ఆలయానికి మరో రూ.7 కోట్లు : సీఎం

తిమ్మాపూర్ ఆలయానికి మరో రూ.7 కోట్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతంరం తిమ్మాపూర్ లో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో పాల్గొన్న సీఎం... సమైక్య పాలనలో సాగు నీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. సింగూరు నీటి కోసం రైతులు ఉద్యమించారని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి నిజాంసాగర్ కూడా ఒక భాగమేనన్న ఆయన.. బాన్సువాడ ప్రాంతంలో గతంలో అనేక ఇబ్బందులు ఉండగా ప్రస్తుతం రూ.1500 కోట్ల వరి పంట సాగవుతోందని తెలిపారు. బాన్సువాడ ప్రజలకు భవిష్యత్ లో స్పీకర్ పోచారం సేవలు అవసరమని సీఎం కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. దాంతో పాటు నియోజకవర్గానికి రూ.50 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్టు సీఎం స్పష్టం చేశారు.