రిశాట్–2బీఆర్1 శాటిలైట్ ను ప్రయోగించనున్న ఇస్రో
బార్డర్‌లో మన మిలటరీ నిఘా పవర్ ను మరింతగా పెంచే ఇంకో శాటిలైట్ త్వరలో నింగికి చేరనుంది. పోయిన నెల 27న కార్టోశాట్–3 శాటిలైట్ ను కక్ష్యలోకి పంపిన ఇస్రో.. ఈ నెల 11న రిశాట్–2బీఆర్1 ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ను శ్రీహరికోటలోని షార్ నుంచి పీఎస్ఎల్వీ సీ48 రాకెట్ ద్వారా ఇస్రో ప్రయోగించనుంది. రిశాట్ సిరీస్ లో నాలుగు లేదా ఐదు ఉపగ్రహాలను అంతరిక్షంలో మోహరించాలని ఇస్రో భావిస్తోంది. ఇందులో మొదటి శాటిలైట్ రిశాట్ 2బీను ఈ ఏడాది మే 22న కక్ష్యకు చేర్చింది. రిశాట్-2బీఆర్1 రెండో ఉపగ్రహం కాగా, దీని తర్వాత మూడో శాటిలైట్ గా రిశాట్ 2బీఆర్2ను కూడా ఈ నెల రెండో సగంలోనే కక్ష్యలోకి చేర్చాలని ఇస్రో ప్లాన్ చేస్తోంది. పీఎస్ఎల్వీ సీ48 ద్వారా జపనీస్ కంపెనీకి చెందిన క్యూపీఎస్ ఎస్ఏఆర్ అనే మైక్రో శాటిలైట్, అమెరికన్ కంపెనీకి చెందిన నాలుగు లెమూర్ 2 క్యూబ్ శాట్లను కూడా ప్రయోగించనున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి.
24 గంటలూ ఫోకస్..
రిశాట్ సిరీస్ లో కనీసం నాలుగు ఉపగ్రహాలను నింగికి పంపితే చాలు.. మన సరిహద్దుల్లో టెర్రరిస్టుల చొరబాట్లకు చెక్ పెట్టవచ్చని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. సరిహద్దులోని ఏదైనా ఒకే ప్రాంతంపై కూడా 24 గంటలపాటూ నిరంతరం ఈ ఉపగ్రహాలతో నిఘా ఉంచవచ్చనీ వారు వెల్లడించారు. ఈ ఉపగ్రహాల్లో ఇజ్రాయెల్ రాడార్ ‘టెక్సార్ 1’ సిస్టం ఆధారంగా తయారు చేసిన పవర్ ఫుల్ రాడార్ ను ఉపయోగిస్తున్నారు. ఇవి ఒకే సమయంలో 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో స్పష్టమైన ఫొటోలు తీయగలవు. కేవలం 0.35 మీటర్ల దూరంలో ఉన్న రెండు వేర్వేరు వస్తువులను కూడా ఇవి స్పష్టంగా గుర్తించగలవు. సుమారు 615 కిలోల బరువున్న రిశాట్ 2బీఆర్1 ఐదేళ్ల పాటు పని చేస్తుంది. ఇవి నిఘా సేవలకు మాత్రమే కాకుండా, వాతావరణం అంచనా, వ్యవసాయం, అడవులు, విపత్తుల నిర్వహణలో కూడా సాయపడతాయని చెప్తున్నారు.