ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ టీడీపీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే రెడ్డపగారి రమేష్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ హైకమాండ్ కు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని వెల్లడించారు. ప్రజలకు సేవ చేసే పార్టీలా టీడీపీ పనిచేయడం లేదన్నారు.
డబ్బులు తీసుకుని టికెట్లు అమ్ముకోవడం దారుణం అన్నారు. పార్టీ అభివృద్ధికి పని చేసిన వారికి టీడీపీలో గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాబోతున్నామని ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేసి డబ్బున్న వారిని పార్టీలో చేర్చుకుని టిక్కెట్లు ఇచ్చారని విమర్శించారు. తనకు టికెట్ ఇవ్వకపోయినా తాము బాధపడేవాళ్లం కాదని పార్టీలో కనీస గౌరవం ఇవ్వకపోవడం వల్లే టీడీపీని వీడాల్సి వస్తోందన్నారు.
జరుగుతోన్న అన్యాయాన్ని చెప్పుకోవడానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అపాయింట్‌మెంట్ సైతం దొరకని పరిస్థితి టీడీపీలో ఉందన్నారు. పార్టీ సంప్రదాయాలను తుంగలో తొక్కారని, నియంత పోకడలను అనుసరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నిర్ణయించిన అభ్యర్థి సరైనవారు కాదని తెలుగుదేశం పార్టీకి రాయచోటి ప్రజలు ఓటు వేయాల్సిన అవసరం లేదని ప్రజలకు సూచించారు.
ఏప్రిల్ 10 బుధవారం నాడు వినుకొండలో జరిగే మేమంతా సిద్ధం సభలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు రమేష్ కుమార్ రెడ్డి.