భార్య వేధింపులకు మరో టెకీ బలి.. తల్లిదండ్రుల జోలికి రావొద్దని కన్నీళ్లు

భార్య వేధింపులకు మరో టెకీ బలి.. తల్లిదండ్రుల జోలికి రావొద్దని కన్నీళ్లు

ఆగ్రా: భార్య వేధింపులను తట్టుకోలేక తనువు చాలిస్తున్నానని పేర్కొంటూ మరో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనలాంటి కష్టాలు ఇంకెవరికీ రావొద్దని, మగవాళ్ల సేఫ్టీ గురించి కూడా ఆలోచించాలని ఉరేసుకునే ముందు తీస్కున్న సెల్ఫీ వీడియోలో కోరాడు.

తల్లిదండ్రుల జోలికి రావొద్దని కన్నీళ్లు.. 

ఆగ్రాకు చెందిన మానవ్ శర్మ(35) ఓ ఐటీ కంపెనీలో మేనేజర్‎గా పనిచేస్తున్నాడు. పోయినేడాది పెండ్లి చేసుకున్న మానవ్ .. భార్యతో విభేదాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆమె మరెవరితోనో ఎఫైర్ పెట్టుకుందని, తనను వేధిస్తోందని ఆరోపిస్తూ మెడకు ఉరి బిగించుకుని సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ మగవాళ్ల గురించి కూడా ఆలోచించాలని వేడుకున్నాడు. మగవాళ్లకు రక్షణగా చట్టాలు చేయకపోతే సమాజంలో బతకడమే కష్టం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు

భార్య వేధింపులతో ఇదివరకే సూసైడ్ అటెంప్ట్ చేశానంటూ చేతి మణికట్టును కోసుకున్న తాలూకా గుర్తులను వీడియోలో చూపించాడు. ఇంకా భరించే ఓపికలేకే ఈ నిర్ణయానికి వచ్చానని పేర్కొన్నాడు. తన మరణానంతరం తన తల్లిదండ్రుల జోలికి రావొద్దని వేడుకుంటూ దాదాపు 7 నిమిషాలపాటు తీసుకున్న వీడియోను సేవ్ చేసి, ప్రాణాలు తీసుకున్నాడు. 

అన్నీ తప్పుడు ఆరోపణలే: మానవ్ భార్య

తన కొడుకు మరణానికి కోడలే కారణమని మానవ్ శర్మ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఇవన్నీ తప్పుడు ఆరోపణలేనని శర్మ భార్య ఖండించింది. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.