
హైదరాబాద్ సిటీ, వెలుగు: కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియలో మరో ముందడుగు పడింది. ఇప్పటికే బోర్డు పరిధిలోని ప్రాంతాలకు జీహెచ్ఎంసీ పలు పౌర సేవలు అందిస్తుండగా, వాటర్ బోర్డు తాగునీటిని సరఫరా చేస్తోంది. ఈ క్రమంలో బోర్డును పూర్తిగా జీహెచ్ఎంసీలో విలీనం చేసేలా ఏడెనిమిది ప్రధానంశాలపై అధ్యయనం చేసేందుకు కంటోన్మెంట్ బోర్డు, జీహెచ్ఎంసీ అధికారులతో జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
ఈ కమిటీలో ఉభయశాఖల అధికారులు జీహెచ్ఎంసీకి అప్పగించనున్న రోడ్లు, పౌర సేవల నిర్వహణ, ఇతర అంశాలను స్టడీ చేయనున్నారు. పలువురు కంటోన్మెంట్ అధికారులు సోమవారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితిని కలిసి పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటుకు కంటోన్మెంట్ పరిధిలో ఎక్కడెక్కడ స్థలాలు అందుబాటులో ఉన్నాయి? స్థలాలిచ్చేందుకు కంటోన్మెంట్ ప్రత్యామ్నాయంగా ఎక్కడెక్కడ స్థలాలను డిమాండ్ చేయనుందన్న విషయంపై మున్ముందు జరిగే భేటీల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశమున్నట్లు తెలిసింది.