జగిత్యాల టౌన్​లో రోడ్ల విస్తరణ.. కొత్తగా బైపాస్​ రోడ్లకు ప్రపోజల్స్​

  •     రూలింగ్​పార్టీ లీడర్ల ఒత్తిడితోనే నామమాత్రపు పెంపు 
  •     కలిసే అవకాశమున్న గ్రామాలనూ విలీనం చేయకపోవడంపై విమర్శలు 
  •     జగిత్యాలకు కొత్త మాస్టర్ ప్లాన్- 2041పై అభ్యంతరాలకు అవకాశం 

జగిత్యాల, వెలుగు: జగిత్యాల మాస్టర్ ప్లాన్–2041 కి సంబంధించి మరో అడుగు ముందుకుపడింది. వచ్చే 20 ఏండ్లలో పట్టణ అవసరాలకు అనుగుణంగా డ్రాఫ్ట్​ప్లాన్​ తయారు చేసి అభ్యంతరాలకు గడువు ప్రకటించారు. అయితే కొత్త మాస్టర్​ప్లాన్‌‌లో పట్టణ విస్తీర్ణం పెరగలేదు. రూలింగ్​పార్టీ లీడర్ల ఒత్తిడితోనే  ప్లాన్‌‌లో పట్టణ పరిధిని నామమాత్రంగా పెంచారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  పట్టణం భవిష్యత్​అవసరాల కోసం పరిసర గ్రామాలను విలీనం చేయాల్సి ఉన్నా ఉన్నా..ఆ దిశగా కసరత్తు చేయలేదు. పట్టణ అభివృద్ధికి సమీప ప్రాంతాలను కలపాలని పట్టణవాసులు డిమాండ్​చేస్తున్నారు. ప్రస్తుత మాస్టర్ ప్లాన్‌‌పై అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణకు ఫిబ్రవరి 28 వరకు అవకాశం ఇచ్చారు. 

జగిత్యాలకు యావర్ రోడ్డు కీలకం

జగిత్యాల పట్టణానికి యావర్ రోడ్ కీలకం.  పాత, కొత్త బస్టాండ్లను కలిపే ఈ రోడ్డును 80 ఫీట్ల నుంచి 100 ఫీట్లకు పెంచాలని ప్రతిపాదించారు. జిల్లా నడిబొడ్డున ఉన్న  క్లాక్​టవర్ చుట్టూ ఉన్న రోడ్డును 40 ఫీట్ల నుంచి 50 ఫీట్లుగా,  నిజామాబాద్–కరీంనగర్ రోడ్ 100 నుంచి 150 ఫీట్లుగా, కరీంనగర్–ధర్మపురి రోడ్డును 80 నుంచి 100 ఫీట్లకు విస్తరించాలని ప్లాన్‌‌లో ప్రతిపాదించారు. ఓల్డ్ బస్టాండ్ నుంచి గొల్లపల్లి బైపాస్ రోడ్డు 60 ఫీట్లు ఉండగా 80ఫీట్లకు,  కెనాల్ బైపాస్ నుంచి గొల్లపల్లి బైపాస్ రోడ్డు జంక్షన్ వరకు 60 ఫీట్లు ఉండగా 200 ఫీట్లకు, రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద 80 నుంచి 150 ఫీట్లకు, బీట్ బజార్ నుంచి రైల్వే స్టేషన్‌‌కు ప్రస్తుతమున్న 60 ఫీట్ల రోడ్డును 100 ఫీట్లకు పెంచాలని, నిజామాబాద్ రోడ్డులోని హస్నాబాద్ నుంచి లింగంపేట రైల్వే స్టేషన్‌‌కు కనెక్టింగ్ రోడ్డు డెవలప్ చేయాలని నిర్ణయించారు. 

ఓల్డ్ బస్టాండ్ నుంచి  ఖిలాగడ్డ వరకు ఉన్న 50 ఫీట్లను 80 ఫీట్లుగా మార్చాలని, జగిత్యాల నుంచి పెర్కపల్లి వరకు ఉన్న రోడ్డును 50 నుంచి 80ఫీట్లుగా, మిషన్ కాంపౌండ్ చర్చి నుంచి కండ్లపల్లి వరకు ఉన్న 40 ఫీట్లను 60 ఫీట్లుగా విస్తరించాలని ప్రపోజ్ చేశారు.  కొత్తగా కరీంనగర్ హైవే నుంచి నిజామాబాద్ హైవే వరకు 200 ఫీట్లతో బైపాస్, కరీంనగర్ రోడ్ నుంచి ధర్మపురి రోడ్ కు 200 ఫీట్లతో మరో బైపాస్,  కరీంనగర్ రోడ్ నుంచి లింగంపేట్ రైల్వే స్టేషన్ కు 200 ఫీట్ల రోడ్డు, జగిత్యాల నుంచి టీఆర్​నగర్ కు 40 ఫీట్లతో రోడ్డు కోసం ప్రతిపాదించారు. 

జోన్ల పెంపు :  గత ప్లాన్‌‌లో జోన్లు ఏర్పాటు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గతేడాది జోన్లు సవరించారు. ఇండస్ట్రీయల్​జోన్ కింద రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, లింగంపల్లి ప్రాంతాలు,  కమర్షియల్ జోన్ కింద మెయిన్ రోడ్లు పరిసర ప్రాంతాలు, ఓపెన్ స్పేస్​కింద గ్రీన్ బఫర్ ప్రాంతాలు, గ్రీన్ బఫర్ జోన్ కింద చెరువు సమీపంలోని 9-30 మీటర్ల ఏరియాను చేర్చారు. విలీన గ్రామాలు ధరూర్, మోతె, లింగంపల్లి, తిమ్మాపూర్, తిప్పన్నపేట్, నూకపల్లి హౌజింగ్ బోర్డు, టీఆర్ నగర్ లను ప్లానింగ్ జోన్ కిందకు చేర్చుతూ  మాస్టర్ ప్లాన్‌‌లో ప్రతిపాదనలు రూపొందించారు. 

జిల్లాగా ఏర్పాటైనా నామమాత్రపు విస్తీర్ణమే 

జగిత్యాల జిల్లాకేంద్రంగా మారడంతో పట్టణం పెరుగుతోంది. మున్సిపాలిటీలో 38 వార్డులను 46 వార్డులుగా విభజించారు. దీంతో పాటు సమీపంలోని టీఆర్ నగర్ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేసి 47, 48 వార్డులుగా ఏర్పాటు చేశారు. అయితే ఈ విలీనంపై విమర్వలు వ్యక్తమవుతున్నాయి. విలీనం చేసుకునేందుకు వీలుగా ఉన్న ధరూర్‌‌‌‌ను విడిచిపెట్టి పక్కనున్న టీఆర్ నగర్ ను కలపడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే బల్దియా పరిధిని ఆనుకుని ఉన్న మోతె, తిపన్నపేట్, హస్నాబాద్ తో పాటు చుట్టుపక్కల గ్రామాలను పూర్తి స్థాయిలో కలిపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎస్సారెస్పీ స్థలం లో కలెక్టరేట్, మెడికల్ కాలేజీలు రావడంతో బల్దియాలో ఆటో నగర్, హెవీ వెహికిల్ పార్కింగ్‌‌లకు సుమారు 30 ఎకరాల వరకు స్థలం అవసరముంది. అయితే పట్టణంలో ప్రభుత్వ స్థలాల కొరత ఉంది. 

కొత్త మాస్టర్​ప్లాన్‌‌తో పట్టణం అభివృద్ధి:

ఎన్నో ఏండ్లుగా సరైన జోన్లు, రోడ్ల విస్తరణ లేక జగిత్యాల పట్టణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇంటి నిర్మాణాలకు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్త మాస్టర్ ప్లాన్ అమలైతే రోడ్ల విస్తరణతో పాటు పట్టణం మరింత అభివృద్ధి చెందుతుంది. - బోగ శ్రావణి, బల్దియా చైర్‌‌‌‌పర్సన్, జగిత్యాల