తండ్రి పాతింట్లో.. కొడుకు, కోడలు బంగ్లాలో.. జడేజా దంపతులపై మరో కథనం

తండ్రి పాతింట్లో.. కొడుకు, కోడలు బంగ్లాలో.. జడేజా దంపతులపై మరో కథనం

క్రికెట్ ఫీల్డ్‌లో తొడలు చరిచి, మీసాలు మెలేసే భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇంటి బాగోతం నడివీధికి ఎక్కిన విషయం తెలిసిందే. కోడలి రాకతో తమ కొంప కొల్లేరు.. అయ్యిందంటూ కొద్దిరోజుల క్రితం జడేజా తండ్రి అనిరుధ్ సింగ్ మీడియా ముందు వాపోయారు. పెళ్లైన మూడు నెలలకే రివాబా తమ కుటుంబంలో గొడవలు సృష్టించిందని, ఆమెకు ఉమ్మడిగా కలిసి ఉండటం నచ్చేదికాదని ఆరోపించారు. 

 తన కొడుకు(రవీంద్ర జడేజా) ఓ ఇంటి వాడవుతుంటే తానెంతో మురిసిపోయానని, కానీ వచ్చిన కోడలు(రివాబా) ఏం మాయ చేసిందో తలియదు కానీ కొన్నాళ్లకే మారిపోయాడంటూ అనిరుధ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి పేరిట ఉన్న ఆస్తులన్నింటిని కోడలు తన పేరు మీదకు మార్చుకుందని తెలిపారు. ఒకే నగరంలో ఉంటున్నప్పటికీ.. ఎవరి జీవితం వారిదేనని ఆయన చెప్పుకొచ్చారు. మనుమరాలిని చూసి ఐదేళ్లయ్యిందని, కనీసం కుమారుడి పలుకరింపుకు సైతం తాను నోచుకోలేదని చెప్తూ ఆయన ఎంతో బాధపడ్డారు. ఇది జరిగిపోయిన కథనం.

తండ్రికి సందర్శకుల తాకిడి

ఈ ఘటన అనంతరం జడేజా తండ్రి ఇంటికి సందర్శకుల తాకిడి బాగా పెరిగిందట. ఇంటర్వ్యూల కోసం పత్రికల వారు రోజుకొకరు ఆయన ఇంటి తలుపు కొడుతున్నారట. మీ కొడుకుతో మీ బంధం గురించి చెప్తే రాసుకుంటాం అని ఆయన వెంట పడుతున్నారట. వీరి నుంచి తప్పించునేందుకు ఆయన ఉదయాన్నే ఇంటిని వీడి, ఎప్పుడో చీకటి పడ్డాక చేరుకుంటున్నారట. ఆయన ఉంటున్న నివాసం గురించి కథనాలు వస్తున్నాయి. ఆ ఇంటిని ప్రస్తుతం జడేజా, రివాబా దంపతులు ఉంటున్న ఇంటితో పోల్చుతూ వ్యాసాలు రాస్తున్నారు. 

తండ్రి పాతింట్లో.. కొడుకు, కోడలు బంగ్లాలో

జడేజా 1988, డిసెంబర్ 6న జామ్‌నగర్ జిల్లాలోని నవగం ఘేడ్ నగరంలో రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించాడు. బాల్యంలోనే తల్లిని పోగొట్టుకున్న అతడు.. కన్నతండ్రి, తోబుట్టువుల నీడలో పెరిగి గొప్పక్రికెటర్ అయ్యాడు. భారత జట్టు సభ్యుడిగా, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడిగా కోట్ల రూపాయలు ఆర్జించాడు. ఈ క్రమంలో వయసొచ్చాక ఓ ధనిక కుటుంబానికి చెందిన రివాబాను మనువాడాడు. అక్కడి నుంచే అసలు కథ ప్రారంభమయ్యింది. అతనికి తన తండ్రి, తోబుట్టవులతో సంబంధాలు తెగిపోయాయి. 

ప్రస్తుతం జడేజా దంపతులు అత్తమామలతో కలిసి ఓ ఖరీదైన బంగ్లాలో నివసిస్తుండగా.. అతని తండ్రి పాతింట్లోనే జీవనం సాగిస్తున్నారు. మరోవైపు, జడేజా తండ్రికి ఆర్థిక సాయం చేయడానికి దాతలు కూడా ఆయన ఇంటికొస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. బాల్యంలో కంటికి రెప్పలా చూసుకొన్న తండ్రి, అక్క, చెల్లెళ్లను జడేజా నిర్లక్ష్యం చేయడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. ఏ తండ్రి తన కుమారుడిపై లేనిపోని అభాండాలు వేయరని ఇప్పటికైనా ఆయనను తమతో రమ్మని కోరాల్సిందిగా అతనికి సూచిస్తున్నారు. దీనికి ఎప్పుడు ముగింపు దొరుకుతుందో వేచిచూడాలి.