ఇమాంపేట గురుకులానికి చెందిన మరో స్టూడెంట్ అత్మహత్య

సూర్యాపేట, వెలుగు: ఇమాంపేటలోని గురుకుల పాఠశాలకు చెందిన మరో బాలిక ఇంట్లో చున్నీతో ఉరేసుకుని చనిపోయింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతే మండలంలో చోటుచేసుకుంది. బురకచర్ల గ్రామానికి  చెందిన ఇరుగు ఆనంద్, జ్యోతిల కుమార్తె అస్మిత(15).. సూర్యాపేట మండలం, ఇమాంపేటలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో టెన్త్ చదువుతున్నది. ఇటీవల ఇదే గురుకుల కాలేజీకి చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థిని ఉరివేసుకొని చనిపోవడంతో అధికారులు నాలుగు రోజులు(హోం సిక్ ) సెలవులు ప్రకటించారు.

దాంతో అస్మిత ఇంటికి వెళ్లింది. శనివారంతో  సెలవులు మగిశాయి. తిరిగి పాఠశాలకు వెళ్తానని అస్మిత తల్లికి చెప్పింది. దాంతో తల్లి పనులకు వెళ్లింది. అయితే, ఆమె పని ముగించుకుని తిరిగి వచ్చేసరికి అస్మిత ఇంట్లోనే ఫ్యాన్ కు చున్నీతో  ఉరివేసుకుంది. పాఠశాలకు వెళ్లాల్సిన రోజే అస్మిత ఉరివేసుకోవడం మిస్టరీగా మారింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యా్ప్తు జరుపుతున్నారు.

ఇటీవల ఇమాంపేటలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ స్టూడెంట్ వైష్ణవి కాలేజీ ఫేర్వెల్ పార్టీ జరిగిన సాయంత్రమే ఉరివేసుకుని చనిపోయింది. ఘటనపై మృతురాలి బంధువులు, విద్యార్థి, ప్రజాసంఘాలు ధర్నాలు చేశారు. దాంతో కళాశాల ప్రిన్సిపల్ ను అధికారులు శుక్రవారమే సస్పెండ్ చేశారు. ఆ ఘటన మరువకముందే అస్మిత బలవన్మరణానికి పాల్పడటం విద్యర్థులోనూ, తల్లిదండ్రుల్లోనూ ఆందోళన కలిసిస్తున్నది.