హైదరాబాద్లో మరో మూడ్రోజులు వానలు

హైదరాబాద్లో మరో మూడ్రోజులు వానలు
  •     నిన్న జీడిమెట్లలో అత్యధికంగా 3.7 సెంటీ మీటర్ల వాన

హైదరాబాద్/జీడిమెట్ల, వెలుగు :  సిటీలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం వర్షం కురిసింది. జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, గాజులరామారం ఏరియాల్లో దంచికొట్టింది. అత్యధికంగా జీడిమెట్లలో 3.7 సెంటీ మీటర్ల వాన పడింది. కుత్బుల్లాపూర్​లో 3.3, గాజులరామారంలో 2.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్​లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాజ్​పేయినగర్​రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది.

3 సెంటీమీటర్ల వానకే ఈ మేర నీరు నిలిస్తే, వర్షాకాలంలో ఇంకెలా ఉంటుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వరద నీరు వెళ్లేలా చూడాలని కోరారు. అలాగే మరో మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం

ఉందని వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. శనివారం సిటీలో వాతావరణం పొడిగా ఉంటుందని, ఆది, మంగళవారాల్లో భారీ వర్షాలు(6.4 సెం.మీ. – 11.5 సెం.మీ.) కురవచ్చని అంచనా వేశారు. సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చన్నారు.