
కాగజ్‌నగర్, వెలుగు: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో మరో పులి సంచారం బయటపడింది. తెలంగాణ సరిహద్దులో మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మాకుడి రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం ఉదయం ఓ పులి రైలు పట్టాలు దాటుతూ స్థానికులకు కనిపించింది. ఈ ప్రాంతం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) మండలానికి ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మహారాష్ట్రలోని తాడోబా టైగర్ రిజర్వ్‌ను ఆనుకొని సిర్పూర్ (టి) రేంజ్ ఉంది. ప్రస్తుతం మాకుడి ప్రాంతంలో తిరుగుతున్న పులి తెలంగాణలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఫారెస్ట్ ఆఫీసర్లు భావిస్తున్నారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.