- పదేండ్ల బాలికపై అత్యాచారం, హత్య
- రేప్ చేసి చంపేశారని ఆరోపణలు
- ఒంటినిండా గాయాలతో మృతదేహం
- ఆగ్రహంతో పోలీస్ ఔట్‌పోస్టుకు నిప్పుపెట్టిన గ్రామస్తులు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో మరో ఘోరం జరిగింది. ఆర్జీ కర్ ఆసుపత్రిలో లేడీ డాక్టర్‌ను రేప్ చేసి చంపేసిన ఘటన మరువక ముందే ఓ బాలిక కూడా అదే తరహాలో బలైంది. ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా కొంతమంది దుండగులు బాలికను ఎత్తుకెళ్లి రేప్ చేసి చంపేశారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో శుక్రవారం ఈ ఘోరం జరిగింది. జయనగర్ ఏరియాలో బాలిక మృతదేహం శనివారం బయటపడడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఒంటి నిండా గాయాలతో బాలిక డెడ్‌బాడీ కనిపించడంతో స్థానికులు తీవ్రంగా ఆగ్రహానికి గురై సమీపంలోని మహిస్మరి పోలీసు ఔట్‌పోస్టును తగులబెట్టారు. అక్కడ పార్క్ చేసిన వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. శుక్రవారం సాయంత్రం నుంచే బాలిక కనిపించడంలేదని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా.. పోలీసులు నిర్లక్ష్యం వహించారని వారు మండిపడ్డారు. పోలీసులు సమయానికి స్పందించి ఉంటే ఆమె బతికేదని చెప్పారు. మరోవైపు గ్రామస్తుల దాడితో పోలీసులు అక్కడి నుంచి పారిపోయారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఉన్నతాధికారులు భారీ పోలీసు బలగాన్ని తరలించారు. ఆందోళన చేస్తున్న గ్రామస్తులపైకి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా, ఈ కేసులో తమ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని పోలీసులు చెప్పారు. ఇప్పటికే ఒక నిందితుడిని అరెస్టు చేశామని తెలిపారు.
టీఎంసీ ఎమ్మెల్యేను తరిమిన స్థానికులు
ఆందోళన చేస్తున్న స్థానికులను పరామర్శించడానికి వెళ్లిన టీఎంసీ ఎమ్మెల్యే గణేశ్ మోండల్‌ను స్థానికులు తరిమివేశారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. ‘‘స్థానికుల బాధను నేను అర్థం చేసుకోగలను. అయితే, చట్టాన్ని వారు తమ చేతుల్లోకి తీసుకోరాదు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని
పోలీసులకు విజ్ఞప్తి చేశాను” అని గణేశ్ చెప్పారు.