- భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే చాన్స్
- ఐదు జిల్లాలకు రెడ్.. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. గురువారం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం అర్ధరాత్రికి తీవ్ర అల్పపీడనంగా బలపడిందని పేర్కొంది. అది శుక్రవారం ఉదయం నాటికి వాయుగుండంగా మారిందని, అనంతరం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
దాని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అల ర్ట్ను ఇచ్చింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.
కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు
ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాల్లో ఈ నెల 20 , 21వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. ఆయా జిల్లాల కలెక్టర్లు అలర్ట్‌గా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. శుక్రవారం రాత్రి టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. కాగా, రాష్ట్రంలోని 8 జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలకు తాత్కాలిక ప్రాతిపదికన పక్కా భవనాలను గుర్తించడంతో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ను నియమించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సీఎస్ సూచించారు.