- ఐదు ప్లాంట్లలో ఒక్కటి కూడా పూర్తి కాలే
- కిందటేడు అక్టోబర్‌కే గడువు పూర్తి
- వడ్డీలు, నిర్మాణ ఖర్చుతో భారీగా పెరిగిన అంచనాలు
హైదరాబాద్, వెలుగు: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని గడువులోగా పూర్తి చేయకపోవడంతో రాష్ట్ర సర్కార్‌పై రూ.10 వేల కోట్ల అదనపు భారం పడుతోంది. ఇప్పటికే తీసుకున్న అప్పులకు వడ్డీలు.. మెటీరియల్ రేట్లు పెరగడంతో ఖర్చు భారీగా పెరుగుతోంది. ఈ మేరకు జెన్కో ఆఫీసర్లు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిసింది. నాలుగు వేల మెగావాట్ల కెపాసిటీతో రాష్ట్ర సర్కార్ నల్లగొండలోని దామరచర్ల లో చేపట్టిన ఈ పవర్ ప్లాంట్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2020 అక్టోబర్‌లోనే విద్యుత్ కేంద్రంలోని రెండు ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలి. కానీ ఐదేండ్లు కావొస్తున్నా విద్యుత్ ఉత్పత్తి అటుంచి.. ఇంకా ఒక్క ప్లాంట్ నిర్మాణం కూడా పూర్తి కాలేదు. ఈ ఏడాది ఆఖరుకు రెండు ప్లాంట్లు ప్రారంభం అవుతాయని చెబుతున్నా.. పనులు మాత్రం అందుకు తగ్గట్లుగా సాగడం లేదు.
వడ్డీలు తడిసి మోపెడు
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం అంచనా వ్యయం రూ.30 వేల కోట్లుగా లెక్క గట్టారు. ఈ మొత్తం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అప్పుగా తీసుకుంటున్నారు. ఇందులో ఇప్పటికే రూ.22 వేల కోట్లు తీసుకున్నారు. 2017 అక్టోబర్‌లో ప్రారంభమైన నిర్మాణం 2021 అక్టోబర్ 17 నాటికి పూర్తి చేయాలి. ఆ తరువాత కిస్తీల చెల్లింపులు ఉంటాయి. అయితే నిర్మాణ సమయంలో ఇంట్రెస్ట్ డ్యూరింగ్ కన్ స్ట్రక్షన్ (ఐడీసీ) కింద వడ్డీ తడిసి మోపెడవుతోంది. ఇప్పుడు నిర్మాణం ఆలస్యమైంది. గడువు దాటిపోయి ఇప్పటికే ఏడాది పూర్తి కాగా.. ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తికి మరో రెండేండ్లు పడుతుందని ఆఫీసర్లు చెప్తున్నారు. ఫలితంగా ఈ కాలానికి వడ్డీ దాదాపు రూ.5500 కోట్లు అవుతుందని అంచనా.
థర్మల్ కరెంట్ రేటు ఎక్కువ.. ఆ భారం ఎవరిపై
దేశవ్యాప్తంగా సోలార్, హైడల్, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4 లక్షల మెగావాట్లుగా ఉంది. ఇందులో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2.05 లక్షల మెగావాట్లు. అయితే ఇటీవల కాలంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం మేర ఉత్పత్తి కావడం లేదు. బొగ్గు కొరత ఒకటైతే.. రెండోది థర్మల్ విద్యుత్ యూనిట్ రేటు ఎక్కువగా ఉండటం. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ యూనిట్‌కు రూ.10 దాకా అవుతోంది. రెండేండ్లలో ఇది మరింత పెరిగే చాన్స్ ఉంది. పెరిగే ఆ భారమంతా వినియోగదారుల మీదే పడుతుంది. అందులో భాగంగానే కేంద్రం సోలార్, హైడల్ పవర్ ను ప్రోత్సహిస్తోంది. యాదాద్రి పవర్ ప్లాంట్ కు అవుతున్న ఖర్చును లెక్కలోకి తీసుకుంటే 4 వేల మెగవాట్ల ఉత్పత్తిలోఒక్క మెగవాట్విద్యుత్ ఉత్పత్తికి సగటున రూ.10 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన ఒక యూనిట్ ఉత్పత్తికి రూ.10 అవుతుంది. ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ఒక యూనిట్ రూ.2 నుంచి రూ.6 లోపు దొరుకుతున్నది. ఈ రేటుకు కొంటేనే రాష్ట్రంలోని డిస్కంలు రూ.42 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. ఇక భవిష్యత్‌లో యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్‌కు రూ.10 కొంటే.. ఇంకెంత భారం పడుతుందోనని ఆఫీసర్లు అంటున్నారు. మరోవైపు భదాద్రి జిల్లా మణుగూరులో ప్రభుత్వం నిర్మించిన భద్రాద్రి థర్మల్ కేంద్రం గతేడాది పూర్తయింది. దాని నిర్మాణంలోనూ ఇలాగే జాప్యం జరగడంతో అక్కడ కూడా ఒక యూనిట్ కరెంట్ ఉత్పత్తి ఖర్చు దాదాపు రూ.10 అవుతోంది.
రాష్ట్రం ఒక్క సోలార్ ప్లాంట్ పెట్టలే
థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు వద్దని ఒక వైపు కేంద్రం చెబుతోంది. అయితే అందుకు విరుద్ధంగా భారీ వ్యయంతో కొత్త థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను రాష్ట్రం నిర్మిస్తోంది. భవిష్యత్తులో ఇవి తెలంగాణ డిస్కంలకు మరింత నష్టాలు తెచ్చిపెడుతాయని విద్యుత్ ఇంజనీర్లు చెప్తున్నారు. అదే టైంలో ఇన్ని వేల కోట్ల రూపాయాలతో భద్రాద్రి, యాదాద్రి వంటి థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్మిస్తున్న రాష్ట్ర సర్కార్ అతి తక్కువ ధరకు లభించే ఒక్క సోలార్ విద్యుత్ ప్లాంట్సొంతంగా నిర్మించకపోవడం గమనార్హం. సోలార్ విద్యుత్ అతి చౌకగా దేశంలో యూనిట్‌కు రూ.2 నుంచి రూ.3 కే వస్తోంది. మరోవైపు సోలార్ ప్లాంట్‌తో ఎలాంటి ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు రూ.10 వేల కోట్లు, యాదాద్రికి రూ.30 వేల కోట్లు అప్పు తీసుకున్నది. ఈ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయ్యే కరెంట్‌ను రాబోయే 27 సంవత్సరాల పాటు తెలంగాణ డిస్కంలు ఎంత రేటుకైనా కొని తీరాల్సిందేనని ఇప్పటికే ఒప్పందాలు జరిగాయి. దీంతో డిస్కంలను నష్టాల నుంచి కాపాడాలంటే ప్రజల నుంచి వసూలు చేసే కరెంట్ బిల్లులు భారీగా పెంచాల్సి ఉంటుందని ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు.
సబ్ కాంట్రాక్టు మతలబు ఏంటి?
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భెల్‌కు రాష్ట్ర సర్కార్ అప్పగించింది. కరోనా ప్రభావంతో పనులు ఏడాది ఆలస్యమయ్యాయి. అయితే మరో ఏడాదిన్నర మాత్రం చెప్పిన వాళ్లకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వలేదని.. రాష్ట్ర సర్కారే ఆలస్యం చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టిన కంపెనీకి మెటీరియల్‌కు సంబంధించి ఒక సబ్ కాం ట్రాక్ట్ ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు భెల్‌పై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. భెల్ దానికి ససేమిరా అనడంతో దాదాపు ఏడాదిన్నర పాటు పనులు సరిగా జరగలేదు. ఫలితంగా రెండు ప్లాంట్లు కూడా పూర్తి కా లేదు. ఈ ఆలస్యంతో నిర్మాణ వ్యయం అంచనాలు కూడా భారీగా పెరిగాయి. అదనంగా ఇంకో రూ.4500 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ప్రాజెక్ట్ ఖర్చు రూ.34 వేల కోట్లు కానుంది. వడ్డీలు, నిర్మాణ వ్యయం రెండు కలిపితే అదనంగా రూ.10 వేల కోట్ల భారం పడుతోంది.