
ఝన్సీ (యూపీ): సీనియర్ మెన్స్ నేషనల్ హాకీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు మరో విజయం అందుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ 8–-2 గోల్స్ తేడాతో ఆంధ్రప్రదేశ్‌ను చిత్తు చేసింది. ఆట ప్రారంభం నుంచే ఆధిక్యంలోకి వెళ్లిన తెలంగాణ జట్టులో పీఆర్ అయ్యప్ప ఒక్కడే నాలుగు గోల్స్ (6, 20, 31, 52వ నిమిషాల్లో) కొట్టి ఔరా అనిపించాడు. వెంకటేష్ (3, 55వ ని) రెండు గోల్స్ చేయగా.. రోహిత్ సింగ్ (9వ ని), రామ్ కుమార్ (11వ ని) తలో గోల్స్‌తో జట్టు విజయంలో భాగమయ్యారు.
ఏపీ టీమ్‌లో సందీప్ కుమార్ (13వ ని), వేణు గోపాల్ (50వ ని) ఒక్కో గోల్ కొట్టారు. ఇతర మ్యాచ్‌ల్లో ఢిల్లీ6-–4 తేడాతో అసోంను ఓడించింది. కేరళ 4–-1 తేడాతో దాద్రా నాగర్ హవేలీ– దామన్ డయ్యూపై నెగ్గగా, పంజాబ్ 3–-2 తేడాతో ఒడిశాపై విజయం సాధించింది. మణిపూర్ – కర్నాటక మధ్య మ్యాచ్ 1–-1 గోల్స్‌తో డ్రాగా ముగిసింది.